సచిన్ ఎందుకు మాట మార్చాడు
మెల్‌బోర్న్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున సచిన్‌తో కలిసి ఆడినా...‘మాస్టర్’పై రికీ పాంటింగ్ తన అక్కసును మరోసారి వెళ్లగక్కాడు. ఐదేళ్ల క్రితం నాటి ‘మంకీ గేట్’ వివాదాన్ని ఈ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మరోసారి లేవనెత్తాడు. ఈ ఉదంతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాత్రను పాంటింగ్ ప్రశ్నించాడు. ‘ది క్లోజ్ ఆఫ్ ప్లే’ పేరిట పాంటింగ్ ఓ పుస్తకాన్ని రాశాడు. ఈ వివాదం సమయంలో సచిన్ వాస్తవాలు ఎందుకు మాట్లాడలేదని పాంటింగ్ ప్రశ్నించాడు.
‘ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని మొదట నాతో చెప్పాడు. హర్భజన్‌ను ఆపేందుకు ప్రయత్నించానని అన్నాడు. విచారణలో మాత్రం భజ్జీ మంకీ లేక బిగ్ మంకీ అనగా తాను వినలేదని అతడు ‘తేరి మా కీ’ అనుండొచ్చని, అది మంకీగా వినిపించిందేమో అని జడ్జికి చెప్పాడు. అయితే సచిన్ టెండూల్కర్ మొదటగా ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ మైక్ ప్రాక్టర్‌కు ఎందుకు తెలపలేదో నాకు అర్థం కాకుండా ఉంది’ అని తన పుస్తకంలో రాసుకున్నాడు.
ఐదేళ్ల క్రితం మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా తన పుస్తకంలో సచిన్ పాత్రను విమర్శిస్తూ రాశాడు. 2008లో భారత జట్టు ఆసీస్ పర్యటన సందర్భంగా స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మధ్య జరిగిన గొడవకు ‘మంకీ గేట్’గా పేరు వచ్చింది. తనను మంకీగా సంభోదిస్తూ భజ్జీ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని సైమండ్స్ ఆరోపించాడు. మొదట హర్భజన్‌పై మ్యాచ్ రిఫరీ మూడు టెస్టుల నిషేధం విధించినప్పటికీ జస్టిస్ జాన్ హాన్సెన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో సచిన్ సాక్ష్యంతో భజ్జీకి క్లీన్‌చిట్ వచ్చింది.