రియోకు బై బై.. టోక్యోకు వెల్కమ్
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ క్రీడలు ముగిసాయి. పదహారు రోజుల పాటు అభిమానుల్ని అలరించిన ఒలింపిక్స్ పోటీలకు సోమవారం(భారతకాలమాన ప్రకారం) తెరపడింది. మారకానా స్టేడియంలో ఒలింపిక్ జ్యోతిని అర్పివేసిన అనంతరం ఈ మెగా ఈవెంట్కు ముగింపు పలుకుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) చీఫ్ థామస్ బాచ్ ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు వేడుకలు చూపరులను ఆకట్టుకున్నాయి. చివర్లో జరిగిన బాణసంచా విన్యాసాలతో ఒలింపిక్స్ కు రియో ఘనంగా వీడ్కోలు పలికింది.
రియో మేయర్ ఎడ్యూర్డో పైస్ ఒలింపిక్ పతాకాన్ని 2020 ఒలింపిక్స్ జరిగే టోక్యో గవర్నర్ యురికే కొయికేకు అప్పగించారు. దీంతో రియోకు గుడ్ బై చెబుతూ, టోక్యోకు స్వాగతం పలికారు. ఈ ముగింపు వేడుకలకు జపాన్ ప్రధాని షింజూ అబే హాజరయ్యారు. ఆయన ఎరుపు టోపీ ధరించి సూపర్ మారియా వేష ధారణలో టోక్యో నుంచి రియోకు రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రియో ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు నుజ్మాన్ కార్లోస్ ప్రసంగించిన అనంతరం థామస్ బాచ్ తన సందేశాన్ని వెల్లడించారు.