పతకం ముంగిట...
మరో విజయం సాధిస్తే సానియా-బోపన్న జంటకు పతకం
మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో భారత జోడీ
కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భారత అభిమానుల నిరీక్షణకు తెరపడేలా కనిపిస్తోంది. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడి సానియా మీర్జా-రోహన్ బోపన్న సెమీస్‌కు చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. సెమీస్‌లో గెలిస్తే స్వర్ణం లేదా రజతం దక్కుతుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడిపోయినా... కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. మీరు ఈ వార్త చదివే సమయానికి మనవాళ్లు ఫైనల్‌కు చేరి కనీసం స్వర్ణం లేదా రజతం ఖాయం చేసినా ఆశ్చర్యపోకండి!
రియో డి జనీరో: అంతా అనుకున్నట్లు జరిగితే రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల బోణీ చేయనుంది. టెన్నిస్ ఈవెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-రోహన్ బోపన్న ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పతకానికి కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-బోపన్న జంట 6-4, 6-4తో ఆండీ ముర్రే-హితెర్ వాట్సన్ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. సెమీఫైనల్లో వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) జంటతో సానియా-బోపన్న తలపడతారు.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జంట ఫైనల్‌కు చేరుకుంటుంది. తద్వారా రజతం లేదా స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా సానియా-బోపన్నలకు కాంస్య పతక అవకాశాలు సజీవంగా ఉంటాయి. మిక్స్‌డ్ డబుల్స్ రెండో సెమీస్‌లో ఓడిన జోడీతో (బెథానీ మాటెక్ సాండ్స్-జాక్ సోక్ లేదా రాడెక్ స్టెపానెక్-లూసీ హర్డెకా) సానియా-బోపన్న ఆడాల్సి ఉంటుంది.
డబుల్స్‌లో అంతగా అనుభవం లేని ఆండీ ముర్రే-హితెర్ వాట్సన్‌లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-బోపన్న పూర్తి సమన్వయంతో ఆడారు. నెట్ వద్ద అప్రమత్తంగా ఉంటూ, పదునైన రిటర్న్‌లతో ఆధిపత్యం కనబరిచారు. ఏడో గేమ్‌లో హితెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట ఎనిమిదో గేమ్‌లో తమ సర్వీస్‌నూ కాపాడుకొని 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను నిలబెట్టుకున్నా... పదో గేమ్‌లో బోపన్న ఏస్‌లతో అలరించి సెట్‌ను అందించాడు.
రెండో సెట్‌లో ఐదో గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట ఆ తర్వాత 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని రెండో సెట్‌నూ 6-4తో దక్కించుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. 67 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సానియా-బోపన్న జంట ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది.