గ్రూప్ ‘బి’లో భారత్
- రియో ఒలింపిక్స్ హాకీ
లాసానే: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు కఠిన పరీక్ష ఎదురుకాబోతుంది. ఎనిమిది సార్లు స్వర్ణ పతకం సాధించిన రికార్డు ఉన్న భారత జట్టు పూల్ ‘బిలో ఉండగా దీంట్లోనే డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, ప్రపంచ నంబర్ టూ జట్టు నెదర్లాండ్స్ కూడా ఉన్నాయి. అర్జెంటీనా (6), ఐర్లాండ్ (12), కెనడా (14) మిగతా జట్లు. భారత జట్టు ప్రస్తుతం ఏడో ర్యాంకులో ఉంది.
ఇటీవలి హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్‌లో కాంస్యం కోసం జరిగిన పోరులో భారత్ షూటవుట్‌లో నెదర్లాండ్స్‌పై నెగ్గగా అంతకుముందు జర్మనీని 1-1తో నిలువరించింది. కొత్త నిబంధనల ప్రకారం భారత జట్టు ఐర్లాండ్, కెనడాలపై నెగ్గినా క్వార్టర్స్ చేరుకుంటుంది. ఇక పూల్ ‘ఎ’లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా (1), గ్రేట్ బ్రిటన్ (4), బెల్జియం (5), కివీస్ (8), స్పెయిన్ (11), ఆతిథ్య బ్రెజిల్ (32) ఉన్నాయి. మహిళల హాకీ జట్టు కూడా పూల్ ‘బి’లోనే ఉండగా అర్జెంటీనా, ఆసీస్, గ్రేట్ బ్రిటన్, అమెరికా, జపాన్‌లతో పోటీపడుతుంది.