‘రియో’కు రెజ్లర్లు వినేశ్, సాక్షి అర్హత
ఇస్తాంబుల్ (టర్కీ): భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ అన్న మాట నిలబెట్టుకుంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఒలింపిక్స్ ప్రపంచ క్వాలిఫయింగ్ చివరి టోర్నమెంట్‌లో మహిళల ఫ్రీస్టయిల్ 48 కేజీల విభాగంలో వినేశ్ ఫైనల్‌కు చేరుకోవడంద్వారా ఈ ఘనత సాధించింది. వినేశ్‌తోపాటు భారత్‌కే చెందిన మరో మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ (58 కేజీలు) కూడా రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. ఈ టోర్నీలో ఆయా విభాగాల్లో ఫైనల్స్‌కు చేరిన రెజ్లర్లకు ఒలింపిక్ బెర్త్ ఖాయమైంది.
ఈ టోర్నీలో వినేశ్ స్వర్ణం సాధించగా... సాక్షి రజతం దక్కించుకుంది. ఫైనల్స్‌లో వినేశ్ 6-0తో ఇవోనా నినా మట్కోవ్‌స్కా (పోలండ్)పై గెలుపొందగా... సాక్షి 3-7తో వలెరియా కొబ్లోవా జొలోబోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీలో పాల్గొన్న ఇతర మహిళా రెజ్లర్లు లలిత (53 కేజీలు), గీతిక (69 కేజీలు), కిరణ్ (75 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే ఓడిపోగా... షెరాన్ (63 కేజీలు) కాంస్య పతక పోరులో 0-10తో జోసెఫినా (వెనిజులా) చేతిలో పరాజయం పాలైంది.
రెండు వారాల క్రితం మంగోలియాలో జరిగిన ఒలింపిక్స్ ప్రపంచ క్వాలిఫయింగ్ తొలి టోర్నమెంట్‌లో నిర్ణీత బరువుకన్నా 400 గ్రాములు ఎక్కువగా ఉండటంతో వినేశ్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. అదే టోర్నీలో వినేశ్ అక్కలు గీత, బబితా కుమారిలు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తామ పోటీపడాల్సిన బౌట్‌లలో బరిలోకి దిగలేదు. ఈ పరిణామాలపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కఠిన చర్యలు తీసుకుంది. గీత, బబితాలపై తాత్కాలిక నిషేధం విధించడంతోపాటు చివరిదైన రెండో క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి తప్పించింది.
మరోవైపు తన నిర్లక్ష్య వైఖరి పట్ల క్షమాపణ వ్యక్తం చేసి... రెండో క్వాలిఫయింగ్ టోర్నీలో కచ్చితంగా రియో బెర్త్‌ను సాధిస్తానని వినేశ్ హామీ ఇవ్వడంతో డబ్ల్యూఎఫ్‌ఐ ఆమెను హెచ్చరించి మరో అవకాశం ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం వినేశ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు స్వర్ణం నెగ్గి తన మాట నిలబెట్టుకుంది. గీత స్థానంలో వచ్చిన సాక్షి రియో బెర్త్‌ను దక్కించుకోవడం విశేషం.
ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో భారత్ నుంచి ఇద్దరు మహిళా రెజ్లర్లు అర్హత పొందడం ఇదే ప్రథమం. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి గీత ఫోగట్ మాత్రమే బరిలోకి దిగింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తొలిసారి మహిళల రెజ్లింగ్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు భారత్ నుంచి మూడు ఫార్మాట్‌లలో (పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్, మహిళల ఫ్రీస్టయిల్) రెజ్లర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఆరుగురు రెజ్లర్లు అర్హత పొందారు. క్వాలిఫయింగ్ టోర్నీలో చివరి రోజు ఆదివారం పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో మూడు వెయిట్ కేటగిరిలలో భారత రెజ్లర్లు (86 కేజీలు, 97 కేజీలు, 125 కేజీలు) బరిలో ఉన్నారు.