Wrestler vinesh phogat
-
వినేశ్ ఫొగాట్‌కూ...
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కోవిడ్–19 బారిన పడింది. కరోనా పరీక్షలో తాను ‘పాజిటివ్’గా తేలినట్లు ఆమె స్వయంగా ప్రకటించింది. ఇటీవలే ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికైన వినేశ్... ఇప్పుడు వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవానికి దూరం కానుంది. అవార్డుల కోసం జరుగుతున్న రిహార్సల్స్‌కు ముందే సోనేపట్‌లో ఆమె కరోనా పరీక్షకు హాజరైంది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న వినేశ్, త్వరలోనే కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేసింది. -
వినేశ్‌కు రజతం
న్యూఢిల్లీ: ఈ సీజన్లో వరుసగా నాలుగో స్వర్ణ పతకం సాధించాలని ఆశించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశ ఎదురైంది. బెలారస్లో ఆదివారం ముగిసిన మెద్వేద్ ఓపెన్ టోర్నమెంట్లో వినేశ్ రన్నరప్‌గా నిలిచింది. రష్యా రెజ్లర్ మలిషెవాతో జరిగిన ఫైనల్లో వినేశ్ 0–10తో ఓడింది. ఈ సీజన్లో వినేశ్ స్పెయిన్ గ్రాండ్‌ప్రి, యాసర్ డొగో టోర్నీ, పోలాండ్ ఓపెన్ టోర్నీల్లో పసిడి పతకాలు సాధించింది. మెద్వేద్ టోర్నీలోనే ఇతర భారత మహిళా రెజ్లర్లు కూడా ఆకట్టుకున్నారు. పింకీ (55 కేజీలు), సరిత (57 కేజీలు) కూడా రజతాలు గెలిచారు. సాక్షి మలిక్ (62 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (68 కేజీలు), రాణి (72 కేజీలు), కిరణ్ (76 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. సుశీల్‌కు నిరాశ... రవికి కాంస్యం ఇదే టోర్నీలో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సుశీల్ 7–8తో కడిమగమెదోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో తొలి రౌండ్లో అబ్దురఖమనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో సుశీల్ 90 సెకన్లలో ఓటమి పాలయ్యాడు. అయితే అబ్దురఖమనోవ్ ఫైనల్‌కు చేరడంతో సుశీల్‌కు రెపిచేజ్ పద్ధతి ద్వారా కాంస్య పతక పోరులో ఆడే అవకాశం దక్కింది. పురుషుల 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన రవి దహియాకు కాంస్యం లభించింది. కాంస్య పతక బౌట్లో రవి 9–4తో అరాబిద్జె (రష్యా)పై గెలిచాడు. -
వినేశ్ ఫొగాట్ హ్యాట్రిక్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పట్టిన పట్టు ప్రతి వారం బంగారమవుతోంది. ఆమె వరుసగా మూడో వారం కూడా పసిడి పతకం నెగ్గింది. వార్సాలో జరుగుతున్న పొలాండ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్లో ఆమె మహిళల 53 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ బౌట్లో 24 ఏళ్ల భారత రెజ్లర్ 3–2తో పొలాండ్‌కు చెందిన రొక్సానాపై విజయం సాధించింది. స్వర్ణం నెగ్గే క్రమంలో ఆమె... క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సోఫియా మాట్సన్ (స్వీడెన్)ను కంగుతినిపించింది. గత నెలలో వినేశ్ స్పెయిన్ గ్రాండ్‌ప్రితో పాటు టర్కీలో జరిగిన యాసర్ డొగు ఇంటర్నేషనల్ టోర్నీలో బంగారు పతకాలు నెగ్గింది. హ్యాట్రిక్ స్వర్ణాలు నెగ్గిన రెజ్లర్‌ను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), ఒలింపిక్స్ గోల్డ్‌క్వెస్ట్ (ఓజీక్యూ) ప్రశంసలతో ముంచెత్తింది. ఓ చాంపియన్ రెజ్లర్‌కు అండదండలు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని ఓజీక్యూ సీఈఓ రస్కిన్హా ట్వీట్ చేశారు. -
భారత మహిళా రెజ్లర్‌కు ఎంత కష్టం!
-
భారత మహిళా రెజ్లర్‌కు ఎంత కష్టం!
భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ తీవ్రంగా గాయపడింది. బుధవారం జరిగిన 48 కిలోల ఫ్రీ స్టైల్ విభాగం క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన సన్ యనన్ తో తలపడ్డ బౌట్ లో గాయపడి మధ్యలోనే వైదొలిగింది. దీంతో చైనా రెజ్లర్ బౌట్ విజేతగా ప్రకటించారు. 1-2 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న సన్ సెమీఫైనల్లో ప్రవేశించింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్ లో రొమేనియాకు చెందిన ఎమిలియా అలినాపై 11-0తో ఫొగట్ విజయం సాధించి భారత శిబిరంలో ఆశలు రెకెత్తించింది. అయితే క్వార్టర్స్ లో చైనా రెజ్లర్ సన్ పట్టుకోసం యత్నించగా మోకాలి కింద ప్రాంతంలో ఫొగట్ కు గాయమై నొప్పితో విలవిల్లాడిపోయింది. దీంతో ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి అనంతరం స్ట్రెచర్ పై తీసుకెళ్లారు. -
‘రియో’కు రెజ్లర్లు వినేశ్, సాక్షి అర్హత
ఇస్తాంబుల్ (టర్కీ): భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ అన్న మాట నిలబెట్టుకుంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఒలింపిక్స్ ప్రపంచ క్వాలిఫయింగ్ చివరి టోర్నమెంట్లో మహిళల ఫ్రీస్టయిల్ 48 కేజీల విభాగంలో వినేశ్ ఫైనల్‌కు చేరుకోవడంద్వారా ఈ ఘనత సాధించింది. వినేశ్‌తోపాటు భారత్‌కే చెందిన మరో మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ (58 కేజీలు) కూడా రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. ఈ టోర్నీలో ఆయా విభాగాల్లో ఫైనల్స్‌కు చేరిన రెజ్లర్లకు ఒలింపిక్ బెర్త్ ఖాయమైంది. ఈ టోర్నీలో వినేశ్ స్వర్ణం సాధించగా... సాక్షి రజతం దక్కించుకుంది. ఫైనల్స్‌లో వినేశ్ 6-0తో ఇవోనా నినా మట్కోవ్స్కా (పోలండ్)పై గెలుపొందగా... సాక్షి 3-7తో వలెరియా కొబ్లోవా జొలోబోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీలో పాల్గొన్న ఇతర మహిళా రెజ్లర్లు లలిత (53 కేజీలు), గీతిక (69 కేజీలు), కిరణ్ (75 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఓడిపోగా... షెరాన్ (63 కేజీలు) కాంస్య పతక పోరులో 0-10తో జోసెఫినా (వెనిజులా) చేతిలో పరాజయం పాలైంది. రెండు వారాల క్రితం మంగోలియాలో జరిగిన ఒలింపిక్స్ ప్రపంచ క్వాలిఫయింగ్ తొలి టోర్నమెంట్లో నిర్ణీత బరువుకన్నా 400 గ్రాములు ఎక్కువగా ఉండటంతో వినేశ్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. అదే టోర్నీలో వినేశ్ అక్కలు గీత, బబితా కుమారిలు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తామ పోటీపడాల్సిన బౌట్లలో బరిలోకి దిగలేదు. ఈ పరిణామాలపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కఠిన చర్యలు తీసుకుంది. గీత, బబితాలపై తాత్కాలిక నిషేధం విధించడంతోపాటు చివరిదైన రెండో క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి తప్పించింది. మరోవైపు తన నిర్లక్ష్య వైఖరి పట్ల క్షమాపణ వ్యక్తం చేసి... రెండో క్వాలిఫయింగ్ టోర్నీలో కచ్చితంగా రియో బెర్త్‌ను సాధిస్తానని వినేశ్ హామీ ఇవ్వడంతో డబ్ల్యూఎఫ్ఐ ఆమెను హెచ్చరించి మరో అవకాశం ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం వినేశ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు స్వర్ణం నెగ్గి తన మాట నిలబెట్టుకుంది. గీత స్థానంలో వచ్చిన సాక్షి రియో బెర్త్‌ను దక్కించుకోవడం విశేషం. ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో భారత్ నుంచి ఇద్దరు మహిళా రెజ్లర్లు అర్హత పొందడం ఇదే ప్రథమం. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి గీత ఫోగట్ మాత్రమే బరిలోకి దిగింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తొలిసారి మహిళల రెజ్లింగ్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు భారత్ నుంచి మూడు ఫార్మాట్లలో (పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్, మహిళల ఫ్రీస్టయిల్) రెజ్లర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఆరుగురు రెజ్లర్లు అర్హత పొందారు. క్వాలిఫయింగ్ టోర్నీలో చివరి రోజు ఆదివారం పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో మూడు వెయిట్ కేటగిరిలలో భారత రెజ్లర్లు (86 కేజీలు, 97 కేజీలు, 125 కేజీలు) బరిలో ఉన్నారు.