న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో వరుసగా నాలుగో స్వర్ణ పతకం సాధించాలని ఆశించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశ ఎదురైంది. బెలారస్‌లో ఆదివారం ముగిసిన మెద్వేద్ ఓపెన్ టోర్నమెంట్‌లో వినేశ్ రన్నరప్‌గా నిలిచింది. రష్యా రెజ్లర్ మలిషెవాతో జరిగిన ఫైనల్లో వినేశ్ 0–10తో ఓడింది. ఈ సీజన్‌లో వినేశ్ స్పెయిన్ గ్రాండ్‌ప్రి, యాసర్ డొగో టోర్నీ, పోలాండ్ ఓపెన్ టోర్నీల్లో పసిడి పతకాలు సాధించింది. మెద్వేద్ టోర్నీలోనే ఇతర భారత మహిళా రెజ్లర్లు కూడా ఆకట్టుకున్నారు. పింకీ (55 కేజీలు), సరిత (57 కేజీలు) కూడా రజతాలు గెలిచారు. సాక్షి మలిక్ (62 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (68 కేజీలు), రాణి (72 కేజీలు), కిరణ్ (76 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు.
సుశీల్‌కు నిరాశ... రవికి కాంస్యం
ఇదే టోర్నీలో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సుశీల్ 7–8తో కడిమగమెదోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో తొలి రౌండ్‌లో అబ్దురఖమనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో సుశీల్ 90 సెకన్లలో ఓటమి పాలయ్యాడు. అయితే అబ్దురఖమనోవ్ ఫైనల్‌కు చేరడంతో సుశీల్‌కు రెపిచేజ్ పద్ధతి ద్వారా కాంస్య పతక పోరులో ఆడే అవకాశం దక్కింది. పురుషుల 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన రవి దహియాకు కాంస్యం లభించింది. కాంస్య పతక బౌట్‌లో రవి 9–4తో అరాబిద్జె (రష్యా)పై గెలిచాడు.
వినేశ్‌కు రజతం
Published Mon, Aug 12 2019 5:36 AM | Last Updated on Mon, Aug 12 2019 5:36 AM
Comments
Please login to add a commentAdd a comment