
సిడ్నీ: మెల్‌బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్, భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ క్రీజ్‌లో నోటికి పని చెప్పారు. ఒకరు బ్యాటింగ్ చేస్తుంటే మరొకరు స్లెడ్జింగ్‌కు దిగారు. హద్దులు దాటని ఈ కామెంట్లు ఆ టెస్టులో ఓ భాగమయ్యాయి. అలాగే ఇద్దరి మాటల తూటాలు మీడియాలో బాగానే పేలాయి. అప్పుడు పైన్ చేసిన కామెంట్‌ను పంత్ తాజాగా నిజం చేశాడు. ‘బెస్ట్ బేబీ సిట్టర్’గా అతని భార్య నుంచే కితాబు అందుకున్నాడు. బేబీ సిట్టర్ అంటే తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేనపుడు పసిపిల్లల ఆలనాపాలన చూసే సంరక్షకుడని అర్థం. ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తన నివాసంలో కొత్త సంవత్సరం సందర్భంగా మంగళవారం ఇరు జట్లకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఇందుకు పైన్ భార్య బోని తన ఇద్దరి పిల్లల్ని తీసుకొచ్చింది. వారిలో ఒకరిని పంత్ ఎత్తుకున్నాడు. పక్కనే బోని మరో చిన్నారిని ఎత్తుకుంది. ఈ ఇద్దరిపై కెమెరాలు క్లిక్‌మన్నాయి. అంతే ఆ ఫొటోను పైన్ భార్య బోని తన ఇన్‌స్ట్రాగామ్‌లో సరదాగా ‘పంత్ బెస్ట్ బేబీ సిట్టర్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. మొత్తానికి ‘బాక్సింగ్ డే’ టెస్టులోని స్లెడ్జింగ్ వేడి ‘న్యూ ఇయర్’లో ఇలా చల్లబడింది.
మూడో టెస్టులో రిషభ్ బ్యాటింగ్ చేస్తుంటే పైన్ వ్యంగాస్త్రాలు సంధించాడు. ‘జట్టులోకి ధోని వచ్చాడు. ఇక నువ్వు ఇక్కడే మా బిగ్‌బాష్ లీగ్ ఆడుకో. హోబర్ట్ హరికేన్స్ తరఫున బ్యాటింగ్ చెయ్. అలా ఆసీస్‌లో సెలవుల్ని అస్వాదించు. అన్నట్లు నేను నా భార్య సినిమాకెళ్లి చాలా రోజులైంది. నువ్వు మా ఇంట్లో బేబీ సిట్టర్‌గా ఉంటే మేమిద్దరం సినిమాని ఎంజాయ్ చేస్తాం’ అంటూ స్లెడ్జింగ్ చేశాడు. దీనికి రిషభ్ కూడా దీటుగానే బదులిచ్చాడు. మయాంక్‌తో ‘ఈ రోజు మనం ఓ ప్రత్యేక అతిథిని చూస్తున్నాం. పెద్దగా బాధ్యతలేని పని. అదే తాత్కాలిక కెప్టెన్. ఎపుడైనా ఇలాంటి తాత్కాలిక కెప్టెన్‌ను చూశామా? దాని గురించి విన్నామా? అతన్ని ఔట్ చేసేందుకు శ్రమించాల్సిన పనిలేదు బాయ్స్ (బౌలర్లనుద్దేశించి). మాట్లాడితే చాలు. అతిగా మాట్లాడటమే ఇష్టం. అంతే’ అని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు. ఇదంతా వివాదం కాకపోవడంతో ఆరోగ్యకరంగానే ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment