కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల వర్షం
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ప్రశంసల జల్లులు కురిపించాడు. చాలా రోజుల తర్వాత టీమిండియా విదేశీ గడ్డపై విజయం సాధించిందని, కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్లనే గెలుపు సాధ్యమయిందని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ సహజసిద్ధమై దూకుడుతోనే భారత జట్టుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నాడు. నాయకత్వ లక్షణాలను కూడా కోహ్లీ మరిన్ని నేర్చుకోవాలని సూచించాడు. 9 టెస్టుల తర్వాత శ్రీలంకతో కొలంబోలో టెస్టు మ్యాచ్ లో టీమిండియాను కోహ్లీ విజయాన్ని అందించాడని ప్రశంసించాడు.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలలో ఆ జట్లపై సిరీస్ గెలవాల్సి ఉందన్నాడు. ఇంకా చెప్పాలంటే విరాట్, ఆస్ట్రేలియా ఆటగాడు మైకెల్ క్లార్క్ లాంటి వాడని కితాబిచ్చాడు. కోహ్లీ కూడా క్లార్క్ లాగానే సవాళ్లను సమర్థంగా ఎదర్కొంటాడన్నాడు. క్లార్క్ రిటైర్మెంట్ తర్వాత స్టీవ్ స్మిత్ ఆసీస్ టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. అతడు జట్టును విజయపథంలో నడిపస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్ లో ఆసీస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.