ఫెడరర్... తొమ్మిదోసారి
వింబుల్డన్ ఫైనల్లో ‘స్విస్ స్టార్’
సెమీస్‌లో రావ్‌నిక్‌పై గెలుపు
జొకోవిచ్‌తో టైటిల్ పోరు
లండన్: తనకు అచ్చొచ్చిన వేదికపై మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంటూ స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొమ్మిదోసారి వింబుల్డన్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో ఈ నాలుగో సీడ్ 6-4, 6-4, 6-4తో ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా)పై అలవోకగా గెలిచాడు. రికార్డుస్థాయిలో ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఫెడరర్, ఒకసారి మాత్రం రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్‌తో ఫెడరర్ అమీతుమీ తేల్చుకుంటాడు.
తన కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించిన ‘స్విస్ స్టార్’కు సెమీఫైనల్లో రావ్‌నిక్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. గంటా 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ ప్రతి సెట్‌లో ఒక్కోసారి తన ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. రావ్‌నిక్ 17 ఏస్‌లు సంధించినా ఫెడరర్ ఆల్‌రౌండ్ ఆటతీరు ముందు నిలువలేకపోయాడు.
శ్రమించిన జొకోవిచ్
తొలి సెమీఫైనల్లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6-4, 3-6, 7-6 (7/2), 7-6 (9/7)తో 11వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై చెమటోడ్చి గెలిచాడు. 3 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 17 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
మ్యాచ్ మొత్తంలో ఇద్దరూ తమ సర్వీస్‌లను మూడేసిసార్లు కోల్పోయారు. అయితే టైబ్రేక్‌లో మాత్రం జొకోవిచ్ పైచేయి సాధించి దిమిత్రోవ్ ఆట కట్టించాడు. వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరడం జోకోవిచ్‌కిది మూడోసారి. 2011లో నెగ్గిన అతను గతేడాది ఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు.
పేస్ జోడి ఓటమి
పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి 6-7 (5/7), 3-6, 4-6తో పోస్పిసిల్ (కెనడా)-జాక్ సోక్ (అమెరికా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
నేడు మహిళల ఫైనల్
క్విటోవా (చెక్ రిపబ్లిక్) xబౌచర్డ్ (కెనడా)
ముఖాముఖి రికార్డు: 1-0
సాయంత్రం గం. 6.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం