బోపన్న-సాకేత్ జంటకు షాక్
కివీస్ జోడీ చేతిలో అనూహ్య ఓటమి
భారత్ 1-2తో వెనుకంజ
నేటి రివర్స్ సింగిల్స్ కీలకం
క్రైస్ట్‌చర్చ్: కచ్చితంగా గెలుస్తారనుకున్న చోట భారత పురుషుల టెన్నిస్ జట్టుకు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న డేవిస్ కప్ ఆసియా ఒషియానియా గ్రూప్-1 పోటీలో భాగంగా డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని (భారత్) జోడీకి ఊహించని ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న-సాకేత్ ద్వయం 3-6, 6-7 (1/7), 3-6తో ఆర్తెమ్ సితాక్-మార్కస్ డానియల్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓడిపోయింది.
గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ ద్వయం ఏదశలోనూ భారత్ జోడీకి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ పరాజయంతో భారత్ 1-2తో వెనుకబడింది. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించాలంటే ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లలో భారత ఆటగాళ్లు తప్పనిసరిగా గెలవాల్సిందే. తొలి మ్యాచ్‌లో జోస్ స్థాతమ్‌తో సోమ్‌దేవ్; మైకేల్ వీనస్‌తో యూకీ బాంబ్రీ తలపడతారు.
బోపన్న-సాకేత్ జంటకు డేవిస్ కప్‌లో ఇదే తొలి ఓటమి. గతంలో ఈ జంట కొరియా, చైనీస్ తైపీలతో జరిగిన మ్యాచ్‌ల్లో గెలిచింది. డేవిస్ కప్‌లో మూడేళ్ల తర్వాత భారత జంటకు ఎదురైన ఓటమి ఇదే కావడం గమనార్హం. 2012లో డెనిస్ ఇస్టోమిన్-మురాద్ ఇనోయతోవ్ (ఉజ్బెకిస్థాన్) జోడీ చేతిలో బోపన్న-లియాండర్ పేస్ జంట ఓటమి చవిచూసింది.
ఆజానుబాహులైన బోపన్న, సాకేత్‌లు భారీ సర్వీస్‌లతో హడలెత్తిస్తారని భావించినా అలా జరగలేదు. కేవలం ఐదు ఏస్‌లు సంధించిన భారత జంట మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన బోపన్న-సాకేత్‌లు ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి కూడా బ్రేక్ చేయలేకపోయారు. ‘డబుల్స్‌లో ఓడినప్పటికీ భారత్‌కు ఇంకా విజయావకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లో మనోళ్లు గెలుస్తారనే నమ్మకంతో ఉన్నాను’ అని భారత కోచ్ జీషాన్ అలీ తెలిపారు.