tennis team
-
డేవిస్ కప్‌లో స్పెయిన్ ‘సిక్సర్’
మాడ్రిడ్ (స్పెయిన్): ప్రపంచ పురుషుల టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్ టైటిల్‌ను స్పెయిన్ జట్టు ఆరోసారి సొంతం చేసుకుంది. తుది పోరులో స్పెయిన్ 2–0తో కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో అగుట్ 7–6 (7/3), 6–3తో ఫెలిక్స్ అగుర్పై నెగ్గి స్పెయిన్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. రెండో సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ 6–3, 7–6 (9/7)తో షపోవలోవ్ (కెనడా)ను ఓడించాడు. గతంలో స్పెయిన్ 2000, 2004, 2008, 2009, 2011లలో విజేతగా నిలిచింది. -
టెన్నిస్ జట్టులో నలుగురు తెలంగాణ అమ్మాయిలు
న్యూఢిల్లీ: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత టెన్నిస్ జట్లను ప్రకటించారు. మహిళల జట్టులో ఏకంగా నలుగురు తెలంగాణ క్రీడాకారిణులకు చోటు లభించడం విశేషం. తెలంగాణకు చెందిన జాతీయ చాంపియన్ సౌజన్య భవిశెట్టితోపాటు కాల్వ భువన, సామ సాత్విక, చిలకలపూడి శ్రావ్య శివానిలకు జాతీయ జట్టులో స్థానం లభించింది. ఈ నలుగురితోపాటు ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ), ప్రార్థన తొంబారే (మహారాష్ట్ర) కూడా భారత జట్టులోకి ఎంపికయ్యారు. పురుషుల జట్టులో సాకేత్ మైనేని, నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్), విష్ణువర్ధన్ (తెలంగాణ), మనీశ్ సురేశ్ కుమార్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెడుంజెళియన్ (తమిళనాడు) భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. జాతీయ మాజీ చాంపియన్ అశుతోష్ సింగ్ భారత పురుషుల, మహిళల జట్లకు కోచ్ కమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. దక్షిణాసియా క్రీడలు డిసెంబర్ 1 నుంచి 12 వరకు నేపాల్‌లో జరుగుతాయి. -
భారత టెన్నిస్ జట్టులో సౌజన్య
సాక్షి, హైదరాబాద్: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల టెన్నిస్ జట్టులో హైదరాబాద్ క్రీడాకారిణి సౌజన్య భవిశెట్టికి స్థానం లభించింది. దక్షిణాసియా క్రీడలు డిసెంబర్ 1 నుంచి 10 వరకు నేపాల్‌లో జరుగుతాయి. ఇటీవల జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచి జాతీయ చాంపియన్‌గా అవతరించిన సౌజన్య కొంపల్లిలోని సురేష్ కృష్ణ టెన్నిస్ అకాడమీ (ఎస్‌కేటీఏ)లో శిక్షణ పొందుతోంది. 26 ఏళ్ల సౌజన్య ఇప్పటివరకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో మూడు సింగిల్స్ టైటిల్స్... ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది. -
భారత్‌కు నాలుగో స్థానం
అస్తానా (కజకిస్తాన్): ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్ ‘ఎ’లో భారత మహిళల టెన్నిస్ జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 3–4 స్థానాల కోసం దక్షిణ కొరియాతో శనివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1–2తో ఓడిపోయింది. గాయం కారణంగా కర్మన్ కౌర్ ఈ పోటీలో ఆడలేదు. ఆమె స్థానంలో జాతీయ చాంపియన్ మహెక్ జైన్‌ను బరిలోకి దించారు. తొలి సింగిల్స్‌లో మహెక్ 2–6, 6–3, 1–6తో నా రి కిమ్ చేతిలో ఓటమి పాలైంది. రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 6–3, 6–3తో సునమ్ జియోంగ్ను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే ద్వయం 4–6, 4–6తో సు జియోంగ్ జాంగ్–నా రి కిమ్ జంట చేతిలో పరాజయం పాలైంది. -
బోపన్న-సాకేత్ జంటకు షాక్
కివీస్ జోడీ చేతిలో అనూహ్య ఓటమి భారత్ 1-2తో వెనుకంజ నేటి రివర్స్ సింగిల్స్ కీలకం క్రైస్ట్‌చర్చ్: కచ్చితంగా గెలుస్తారనుకున్న చోట భారత పురుషుల టెన్నిస్ జట్టుకు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న డేవిస్ కప్ ఆసియా ఒషియానియా గ్రూప్-1 పోటీలో భాగంగా డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని (భారత్) జోడీకి ఊహించని ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న-సాకేత్ ద్వయం 3-6, 6-7 (1/7), 3-6తో ఆర్తెమ్ సితాక్-మార్కస్ డానియల్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓడిపోయింది. గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ ద్వయం ఏదశలోనూ భారత్ జోడీకి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ పరాజయంతో భారత్ 1-2తో వెనుకబడింది. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించాలంటే ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లలో భారత ఆటగాళ్లు తప్పనిసరిగా గెలవాల్సిందే. తొలి మ్యాచ్‌లో జోస్ స్థాతమ్‌తో సోమ్‌దేవ్; మైకేల్ వీనస్‌తో యూకీ బాంబ్రీ తలపడతారు. బోపన్న-సాకేత్ జంటకు డేవిస్ కప్‌లో ఇదే తొలి ఓటమి. గతంలో ఈ జంట కొరియా, చైనీస్ తైపీలతో జరిగిన మ్యాచ్‌ల్లో గెలిచింది. డేవిస్ కప్‌లో మూడేళ్ల తర్వాత భారత జంటకు ఎదురైన ఓటమి ఇదే కావడం గమనార్హం. 2012లో డెనిస్ ఇస్టోమిన్-మురాద్ ఇనోయతోవ్ (ఉజ్బెకిస్థాన్) జోడీ చేతిలో బోపన్న-లియాండర్ పేస్ జంట ఓటమి చవిచూసింది. ఆజానుబాహులైన బోపన్న, సాకేత్‌లు భారీ సర్వీస్‌లతో హడలెత్తిస్తారని భావించినా అలా జరగలేదు. కేవలం ఐదు ఏస్‌లు సంధించిన భారత జంట మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన బోపన్న-సాకేత్‌లు ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి కూడా బ్రేక్ చేయలేకపోయారు. ‘డబుల్స్‌లో ఓడినప్పటికీ భారత్‌కు ఇంకా విజయావకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లో మనోళ్లు గెలుస్తారనే నమ్మకంతో ఉన్నాను’ అని భారత కోచ్ జీషాన్ అలీ తెలిపారు. -
తొలిరోజు సమం
యూకీ గెలుపు, సోమ్‌దేవ్ ఓటమి న్యూజిలాండ్‌తో డేవిస్ కప్ పోరు క్రైస్ట్‌చర్చ్: తొలిరోజే 2-0తో స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందనుకున్న భారత పురుషుల టెన్నిస్ జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన డేవిస్ కప్ ఆసియా ఒషియానియా గ్రూప్-1 పోటీలో తొలి రోజు రెండు జట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలిచి సమంగా నిలిచాయి. తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (భారత్) చేజేతులా ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ (భారత్) అలవోక విజయంతో భారత శిబిరానికి ఊరట కలిగించాడు. మొదటి మ్యాచ్‌లో ప్రపంచ 148వ ర్యాంకర్ సోమ్‌దేవ్ 6-4, 6-4, 3-6, 3-6, 1-6తో ప్రపంచ 548వ ర్యాంకర్ మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 151వ ర్యాంకర్ యూకీ 6-2, 6-1, 6-3తో ప్రపంచ 345వ ర్యాంకర్ జోస్ స్థాతమ్ (న్యూజిలాండ్)ను ఓడించి స్కోరును 1-1తో సమం చేశాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో మార్కస్ డానియల్-ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీతో సాకేత్ మైనేని-రోహన్ బోపన్న (భారత్) జంట తలపడుతుంది. మైకేల్ వీనస్‌తో 3 గంటల 43 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ తొలి రెండు సెట్లను నెగ్గి ఆధిక్యంలో ఉన్నప్పటికీ... తర్వాతి మూడు సెట్లలో తడబడి ఓటమిని మూటగట్టుకున్నాడు. స్థాతమ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూకీ అద్భుత ఆటతీరుతో అలరించాడు. గంటన్నరలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో యూకీ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన ఈ ఢిల్లీ కుర్రాడు తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశమే ఇవ్వలేదు. -
సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎస్పీ మిశ్రా
ఏఐటీఏ ప్రకటన న్యూఢిల్లీ: భారత సీనియర్ టెన్నిస్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ ఆటగాడు, హైదరాబాద్‌కు చెందిన ఎస్పీ మిశ్రా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న అనిల్ ధుపార్ స్థానంలో మిశ్రాను నియమించినట్లు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రకటించింది. సెలక్షన్ కమిటీలో డేవిస్ కప్ లేదా ఫెడరేషన్ కప్ ఆడిన ఆటగాళ్లే ఉండాలనే తమ నిబంధన మేరకు మిశ్రాకు చోటు కల్పించినట్లు ఏఐటీఏ కార్యదర్శి భరత్ ఓజా వెల్లడించారు. దీంతో పాటు రెండేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా మిశ్రాకు స్థానం లభించింది. డేవిస్ కప్ కెప్టెన్‌గా ఆనంద్ అమృత్‌రాజ్, కోచ్‌గా జీషాన్ అలీ కొనసాగనున్నారు. మరోవైపు 2015లో జరిగే ఫెడరేషన్ కప్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని ఈసీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.