తొలిరోజు సమం
యూకీ గెలుపు, సోమ్‌దేవ్ ఓటమి
న్యూజిలాండ్‌తో డేవిస్ కప్ పోరు
క్రైస్ట్‌చర్చ్: తొలిరోజే 2-0తో స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందనుకున్న భారత పురుషుల టెన్నిస్ జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన డేవిస్ కప్ ఆసియా ఒషియానియా గ్రూప్-1 పోటీలో తొలి రోజు రెండు జట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలిచి సమంగా నిలిచాయి.
తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (భారత్) చేజేతులా ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ (భారత్) అలవోక విజయంతో భారత శిబిరానికి ఊరట కలిగించాడు. మొదటి మ్యాచ్‌లో ప్రపంచ 148వ ర్యాంకర్ సోమ్‌దేవ్ 6-4, 6-4, 3-6, 3-6, 1-6తో ప్రపంచ 548వ ర్యాంకర్ మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు.
రెండో మ్యాచ్‌లో ప్రపంచ 151వ ర్యాంకర్ యూకీ 6-2, 6-1, 6-3తో ప్రపంచ 345వ ర్యాంకర్ జోస్ స్థాతమ్ (న్యూజిలాండ్)ను ఓడించి స్కోరును 1-1తో సమం చేశాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో మార్కస్ డానియల్-ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీతో సాకేత్ మైనేని-రోహన్ బోపన్న (భారత్) జంట తలపడుతుంది. మైకేల్ వీనస్‌తో 3 గంటల 43 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ తొలి రెండు సెట్‌లను నెగ్గి ఆధిక్యంలో ఉన్నప్పటికీ... తర్వాతి మూడు సెట్‌లలో తడబడి ఓటమిని మూటగట్టుకున్నాడు.
స్థాతమ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూకీ అద్భుత ఆటతీరుతో అలరించాడు. గంటన్నరలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో యూకీ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన ఈ ఢిల్లీ కుర్రాడు తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశమే ఇవ్వలేదు.