దోహా (ఖతర్): భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న కొత్త ఏడాదిని టైటిల్‌తో మొదలుపెట్టాడు. ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో బోపన్న (భారత్)–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) ద్వయం విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో బోపన్న–కూలాఫ్ జంట 3–6, 6–2, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ల్యూక్ బామ్‌బ్రిడ్జ్ (ఇంగ్లండ్)–శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జోడీని ఓడించింది. టైటిల్ నెగ్గిన బోపన్న జంటకు 76,870 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 54 లక్షల 50 వేలు)తోపాటు 250 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శుక్రవారమే జరిగిన సెమీఫైనల్లో బోపన్న–కూలాఫ్ జంట 7–5, 6–2తో రెండో సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)– స్కుగోర్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. ఓవరాల్‌గా 39 ఏళ్ల బోపన్నకు కెరీర్‌లో ఇది 19వ డబుల్స్ టైటిల్.
తెలంగాణ జిమ్నాస్ట్ సురభికి మూడు పతకాలు
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ సురభి ప్రసన్న మూడు పతకాలు సాధించింది. శుక్రవారం జరిగిన అండర్–17 బాలికల మూడు ఈవెంట్‌లలో సురభి రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. ఆల్ అరౌండ్ వ్యక్తిగత విభాగంలో సురభి 39.85 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... టేబుల్ వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్ ఈవెంట్స్‌లో ఆమె రెండో స్థానంలో నిలిచి రెండు రజత పతకాలను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment