
న్యూఢిల్లీ : ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ యువ స్పిన్నర్ రాహుల్ చహర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. చహర్ చాలా తెలివైనవాడని కితాబిచ్చాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని కొనియాడాడు. గురువారం ఫిరోజ్‌షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చహర్ (3/19) స్పిన్ దాటికి ముంబై 40 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చహర్ అద్భుత ప్రదర్శనకు ముగ్ధుడైన రోహిత్.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఈ యువ స్పిన్నర్‌ను ఆకాశానికెత్తాడు.
‘ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేసే విషయంలో చహర్ మొత్తానికి ఎదో చేశాడు. అతను గతేడాది కూడా జట్టులో ఉన్నప్పటికి ఆడే అవకాశం అంతగా రాలేదు. ఒక దశలో మేం అతనికి అవకాశం కల్పించాం. తను ఏం చేయాలో దాన్ని పర్‌ఫెక్ట్‌గా అమలు చేస్తాడు. తన వ్యూహాన్ని అమలు పరచడంలో చాలా తెలవిగా వ్యవహరిస్తాడు. లెఫ్టాండర్స్‌కు బౌలింగ్ చేయడంపై చాలా విశ్వాసంగా ఉంటాడు. కెప్టెన్ అతనిపై నమ్మకం ఉంచితే చాలా ఇరగదీస్తాడు. ఇక తొలి రెండు ఓవర్ల తర్వాత 140 పరుగుల లక్ష్యం చాలులే అనుకున్నాం. మేం అందరం అలానే భావించాం. కానీ అదృష్టవశాత్తు.. మా చేతిలో వికెట్లు ఉన్నాయి. డెత్ ఓవర్లలో పరుగులు చేయడానికి మా పవర్ హిట్టర్స్ ఉపయోగించాలనుకున్నాం. మా స్పిన్నర్ల నైపుణ్యం మాకు తెలుసు. మా ప్రణాళికను విజయవంతగా అమలు చేశాం’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (26 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు), డి కాక్ (27 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా, రబడ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసి ఓడింది. శిఖర్ ధావన్ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. రాహుల్ చహర్ (3/19) స్పిన్‌తో అలరించాడు. హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment