బర్మింగ్‌హామ్: ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు రోహిత్ ఖాతాలో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. కాగా, రోహిత్ సాధించిన రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీలో అతనికి లైఫ్‌లు లభించడం ఇక్కడ గమనార్హం. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ క్యాచ్ వదిలేసినందుకు ఆ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. రోహిత్ (122 నాటౌట్) సెంచరీ నమోదు చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ క్యాచ్‌ను జారవిడచగా అతను హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికీ రోహిత్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక్కడ కూడా రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లండ్ ఆదిలోనే వదిలేయడంతో అతను సెంచరీ చేసి తన వికెట్ ఎంత విలువైందో చాటి చెప్పాడు.
మంగళవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కూడా రోహిత్‌కు లైఫ్ లభించింది. ముస్తాఫిజుర్ వేసిన ఐదో ఓవర్ నాల్గో బంతికి రోహిత్ పుల్ షాట్ ఆడాడు. మిడ్ వికెట్ మీదుగా ఆడిన ఆ షాట్ బ్యాట్‌కు సరిగా తగలకపోవడంతో క్యాచ్ రూపంలో పైకి లేచింది. ఆ అవకాశాన్ని తమీమ్ ఇక్బాల్ జార విడిచాడు. క్యాచ్‌ను పట్టినట్లే పట్టి వదిలేశాడు. ఆ సమయానికి రోహిత్ 9 పరుగులతో ఉన్నాడు. ఇక అటు తర్వాత రోహిత్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు రోహిత్. ఆ క్రమంలోనే 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment