
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ స్లెడ్జింగ్‌పై టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ స్పందించాడు. పైన్‌కు ఓ మంచి ఆఫర్ కూడా ఇచ్చాడు. తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో పైన్ సెంచరీ చేస్తే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంటామన్నాడు. తానే స్వయంగా తమ ముంబై జట్టు బాస్‌తో మాట్లాడి జట్టులోకి తీసుకునేలా ఒప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఇక మూడో టెస్ట్‌లో భాగంగా రెండో రోజు ఆటలో రోహిత్ ఏకాగ్రత దెబ్బతినేలా టిమ్‌పైన్ స్లెడ్జింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే.
రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నఅరోన్ ఫించ్‌తో పరోక్షంగా ‘నువ్వు ఇప్పుడు సిక్స్ కొడితే.. నేను ముంబైకి మారిపోతా’ అంటూ కవ్వించాడు. అయితే ఈ వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోని రోహిత్ తన బ్యాటింగ్‌ను నిలకడగా కొనసాగించాడు. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు రోహిత్ ఈ స్టెడ్జింగ్‌పై స్పందిస్తూ.. ‘నేను పైన్ మాటలు విన్నా. కానీ పట్టించుకోలేదు. కేవలం నా బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి సారించాను. కానీ అదే సమయంలో నేను రహానేతో సరదాగా మచ్చటించాను. పైన్ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. మా ముంబై బాస్‌ను ఒప్పించి మరీ కొనుగోలు చేస్తాం. అతన్ని చూస్తే ముంబై అభిమానిలా ఉన్నాడు.’ అని రహానేతో చెప్పానని రోహిత్ పేర్కొన్నాడు.
తన వెన్నునొప్పి గురించి మాట్లాడుతూ.. ‘ఈ సమస్యతో నేను తొలిసారి బాధపడుతున్నాను. ఇప్పేడేం అంతగా నొప్పి లేదు. ప్రస్తుతం బాగానే ఉంది. గతంలో ఇదే తరహా సమస్యతో బాధపడ్డ కోహ్లితో మాట్లాడాను. ఇది తిరగబెట్టే సమస్యా అని చెప్పాడు. నిన్న ఈ నొప్పిని అంతగా పట్టించుకోలేదు. కానీ కోహ్లి చెప్పిన విషయంతో ప్రస్తుతం జాగ్రత్తలు తీసుకుంటున్నాను’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. రెండో రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెన్ను నొప్పితో రోహిత్ ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment