రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో)
ముంబై : ఈ సీజన్ ఐపీఎల్‌లో తన అభిమానులకు సరప్రైజ్ ఇవ్వనున్నట్లు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇక రేపటి(శనివారం) డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో ఈ సీజన్ ఐపీఎల్‌కు తెరలేవనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడారు.
‘ఈ సీజన్‌లో అభిమానులకు నా బ్యాటింగ్ ఆర్డర్ మార్పుతో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. మా మిడిలార్డర్ బలంగా ఉంది. అద్భుతమైన ఓపెనర్లు ( ఎల్విన్ లూయిస్ (వెస్టిండీస్), ఇషాన్ కిషాన్‌లు) ఉన్నారు. అయితే నేను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయబోతున్నాననేది ఏప్రిల్ 7నే తెలుస్తోంది. ఇదే నేను అభిమానులకిచ్చే సర్‌ప్రైజ్. ముంబై గొప్ప ఆటగాళ్లతో కూడిన ఓ అద్భుతమైన జట్టు. బయట ఏం జరుగుతోంది మాకు అనవసరం జట్టుగా ముందుకెళ్లి లక్ష్యాన్ని సాధించడమే మా పని. ఈ స్పూర్తినే మేం గత పదేళ్లుగా కొనసాగించి విజయవంతమయ్యాం’. అని పేర్కొన్నాడు
మాపై ఎలాంటి ఒత్తిడి లేదు..
‘ఇక డిఫెండింగ్ చాంపియన్స్‌గా మేం ఎలాంటి ఒత్తిడికి లోనవ్వడం లేదు. అది మా బాధ్యతగా భావిస్తూ.. గర్వంగా ఫీలవుతున్నాం. మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఆటగాళ్లు.. వికెట్లు తీసే బౌలర్లు, పరుగుల వరద పారించే బ్యాట్స్‌మెన్ మా జట్టులో ఉన్నారు. కేవలం మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు కొనసాగడమే మా పని. జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలర్. తమ జట్టుకు అతను అదనపు బలం. గత రెండు, మూడేళ్లుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. గత సీజన్‌లో మలింగా ఫామ్‌లో లేకున్నా రాణించాడు ’అని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
మేం ఫేవరేట్ కాదు: జయవర్దనే
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న మాజట్టు ఫేవరేట్ కాదని , ఇతర జట్లలాగే బరిలో దిగుతున్నామని ముంబై ఇండియన్స్ మెంటార్ మహేల జయవర్దనే తెలిపాడు. ప్రస్తతం మా జట్టు మంచి దశలో ఉందని, చెన్నైతో తొలి మ్యాచ్ ఆడేందుకు పూర్తిగా సిద్దమయ్యామని స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment