ఆ తరహా వ్యాఖ్యలు ఊహించలేదు: రూట్
నాటింగ్హామ్:దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా విఫలమై 133 పరుగులకే చాపచుట్టేసింది. దాంతో 340 పరుగుల భారీ పరాజయాన్ని ఇంగ్లండ్ చవిచూసింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఓవరాల్ గా దక్షిణాఫ్రికా బౌలింగ్ దెబ్బకు ఇంగ్లండ్ బెంబేలెత్తిపోయింది. కనీసం పోరాడటంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. అసలు ఆట మీద గౌరవం లేకపోతేనే ఈ తరహా ప్రదర్శనలు వస్తాయి. మా జట్టు ఆటకు కనీస గౌరవం ఇవ్వలేదు'అని రూట్ సేనపై వాన్ మండిపడ్డాడు.
అయితే తమ కంటే వాన్ చేసిన వ్యాఖ్యలే ఎక్కువ బాధించాయన్నాడు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్. 'ఆటలో గెలుపు-ఓటములు సహజమే. ఆటపై గౌరవం లేదని వాన్ వ్యాఖ్యానించడం సరికాదు. వాన్ నుంచి ఆ రకమైన వ్యాఖ్యలను అస్సలు ఊహించలేదు. దురదృష్టవశాత్తూ రెండో టెస్టులో మా ఆట పేలవంగా ఉన్న మాట వాస్తవమే. దీన్ని సరిచేసుకుని ముందుకు సాగుతాం. ఇక సిరీస్ ను సాధించడంపైనే దృష్టి సారించాం'అని రూట్ పేర్నొన్నాడు.