మౌంట్‌మాంగనీ: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కోల్పోయిన టీమిండియా.. చివరిదైన మూడో వన్డేలో సానుకూల ధోరణితో బరిలోకి దిగుతుందని పేసర్ శార్దూల్ ఠాకూర్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతీ మ్యాచ్ చాలా ముఖ్యమైనదేనని పేర్కొన్న శార్దూల్.. సిరీస్‌ను కోల్పోయామన్న ఆందోళనను వదిలిపెట్టి స్వేచ్ఛగా పోరుకు సిద్ధం అవుతామన్నాడు. ‘ ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్ కోల్పోవడంతో చివరి మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉండకపోవడం అంటూ ఏమీ ఉండదు.
చివరి మ్యాచ్‌లో గెలిచి మమ్ముల్ని మరోసారి నిరూపించుకుంటాం. ఇప్పుడు దానిపై దృష్టి పెట్టాం. న్యూజిలాండ్ వన్డే సిరీస్ విజయంలో ఆ జట్టు వెటరన్ ఆటగాడు రాస్ టేలర్‌దే కీలక పాత్ర. టేలర్ బ్యాటింగ్ అమోఘం. అతను బ్యాట్‌తో విధ్వంసం చేస్తున్న తీరు మతిపోగొడుతుంది. ప్రధానంగా టేలర్ లెగ్ సైడ్ ఆడే విధానం చాలా బాగుంది. క్రికెట్ దేవుడు ఆడుతున్నట్లు ఉంది. రెండు వన్డేల్లో అతనే మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. కాకపోతే టేలర్‌ను రెండు మ్యాచ్‌ల్లోనే ఆదిలోనే ఔట్ చేసే అవకాశాలన్ని చేజార్చుకున్నాం. అతన్ని ఎంత తొందరగా పెవిలియన్ పంపితే అంత పైచేయి సాధించే వీలుంటుంది’ అని శార్దూల్ తెలిపాడు. మంగళవారం టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment