(సునీల్ గావస్కర్)
ఐపీఎల్ దాదాపు సగం ముగిసింది. ఇప్పటి వరకు చూస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందంజ వేయడం కష్టమని మాత్రం ఖాయమైపోయింది. ప్రస్తుత స్థితి చూస్తే వారు రేసులో నిలవాలంటే ఒక అత్యద్భుతమే జరగాలి. ఇకపై బెంగళూరు ఇతర జట్ల అవకాశాలు దెబ్బ తీయగలదని మాత్రం చెప్పగలను. ఒత్తిడిలో చేతులెత్తేస్తున్న బౌలింగే వారికి అతి పెద్ద సమస్య. రసెల్ భీకరంగా చెలరేగిపోతుంటే ఎంతో అనుభవం ఉన్న టిమ్ సౌతీ కూడా సాధారణ వేగంతో లెంగ్త్ బంతులు వేయడం చూస్తే వారిపై ఎంత ఎక్కువ ఒత్తిడి ఉందో అర్థమవుతుంది. గత ఐపీఎల్ సీజన్లలో ఎలాంటి గొప్ప ప్రదర్శన చేయకపోయినా కొందరు భారత ఆటగాళ్లు పదే పదే జట్టులోకి ఎంపిక కావడం నాకు కనిపించింది. టీమ్ కోసం కనీస స్థాయి ఆట చూపించలేని వీరు ఉన్నా లేకున్నా ఒకటే అన్నట్లుగా తయారైంది. ఈ ఫార్మాట్‌లో బౌలింగ్ చేయడం చాలా కష్టమని, నాలుగు ఓవర్లలోనే గొప్ప ప్రదర్శన చూపించడం కష్టమని నాకు తెలుసు. అయితే వారంతా మళ్లీ మళ్లీ భారీగా పరుగులు ఇచ్చి మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేస్తున్నారు.
వీరిలో భారీ మొత్తాలకు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు కూడా ఉండటం చూస్తే ఆయా ఫ్రాంచైజీల తరఫున వీరిని గుర్తించి, ఎంపిక చేసినవారి పనితీరును ప్రశ్నించాల్సి వస్తోంది. ఈ క్రికెటర్లంతా నిజంగా ఏమైనా నేర్చుకుంటున్నారా అనేది కూడా సందేహమే. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం తర్వాత తమ అదృష్టాన్ని మార్చుకునే అవకాశం కోల్‌కతాకు సొంతగడ్డపై లభించింది. ఈడెన్ గార్డెన్స్‌లో వారు చాలా బాగా ఆడతారు కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్‌కు గెలుపు అంత సులువు కాదు. అందరికంటే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆండ్రీ రసెల్, చెన్నైతో మ్యాచ్‌లో సహచరులు కుప్పకూలినా బలంగా నిలబడ్డాడు. అతనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన ఢిల్లీ... బుర్ర లేకుండా ఆడి వరుస పరాజయాలకు కారణమవుతున్న తమ బ్యాటింగ్ లోపాలను కూడా చూసుకోవాలి.
ఆ జట్టులో చాలా మంది తెలివైన క్రికెట్ ఆడే ప్రయత్నం చేయకుండా ఆకర్షణీయమైన షాట్లు కొట్టడంపైనే దృష్టి పెడుతున్నారు. సునాయాసంగా గెలవాల్సిన గత మ్యాచ్‌లో ఓటమిని కొని తెచ్చుకు న్న తర్వాత జట్టుపై కోచ్ విరుచుకుపడే ఉంటాడు. కొత్త ఆటగాళ్లు, కుర్రాళ్లు ఒక మంచి ప్రదర్శనతో ఐపీఎల్‌లో గుర్తింపు కోసం తపన పడుతుండగా, గుర్తింపు పొందిన ఆటగాళ్లైతే ఎలా ఆడినా భారత జట్టులో చోటుకు వచ్చిన సమస్యేమీ లేదని భావిస్తున్నట్లున్నారు. అందువల్ల ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి నెలకొని చెత్త షాట్లు ఆడేందుకు కారణమవుతోంది. స్వేచ్ఛగా ఆడటానికి, నిర్లక్ష్యంగా ఆడటానికి మధ్య సన్నటి గీత మాత్రమే ఉంటుంది. దానిని అతిక్రమిస్తే పరాజయమే ఎదురవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment