ఒక్క ఓవర్. ఒకే ఒక్క ఓవర్ టి20 మ్యాచ్ మొత్తాన్నే మలుపు తిప్పుతుందనే విషయం మళ్లీ తేటతెల్లమైంది. మెక్లీనగన్ ఆ ఒక్క ఓవర్ ముంబైకి శాపమైతే... రాయల్ చాలెంజర్స్‌కు వరమైంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అప్పటిదాకా మూడు ఓవర్లు వేసిన మెక్లీనగన్ 10 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. కానీ చివరిదైన 20వ ఓవర్లో ఏకంగా 24 పరుగులివ్వడం ముంబై కొంపముంచింది. దీంతో బెంగళూరు స్కోరు 143/7 నుంచి 167/7కు పెరిగితే... ముంబై 153/7 స్కోరు వద్ద కట్టడై పరాజయం చవిచూసింది.
బెంగళూరు: ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్–11లో మంగళవారం ఇరు జట్లకు కీలకమైన పోరులో చాలెంజర్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మనన్ వోహ్రా (31 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడగా, మెకల్లమ్ (25 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (3/28) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమైంది. హార్దిక్ పాండ్యా (42 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. బెంగళూరు పేసర్లు మొహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌతీ తలా రెండు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించారు. సౌతీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
రాణించిన వోహ్రా
టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌కు మొగ్గుచూపాడు. దీంతో బెంగళూరు ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన ఓపెనర్లు డికాక్, మనన్ వోహ్రా చెప్పుకోదగ్గ ఆరంభం ఇవ్వలేకపోయారు. మూడు ఓవర్లు ముగిసే సరికి 11 పరుగులే చేశారు. ఆ తర్వాత వోహ్రా ఒక్కసారిగా చెలరేగాడు. డుమిని వేసిన నాలుగో ఓవర్లో రెండేసి సిక్సర్లు, ఫోర్లతో 22 పరుగులు పిండుకున్నాడు. అతను ధాటిగా ఆడుతుంటే... డికాక్ (7) మాత్రం తడబడ్డాడు. జట్టు స్కోరు 38 పరుగుల వద్ద మెక్లీనగన్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వోహ్రాకు మెకల్లమ్ జతయ్యాడు. ఇద్దరు వేగం పెంచుతున్న దశలో మార్కండే బౌలింగ్ వోహ్రా వికెట్ల ముందు దొరికిపోయాడు. 61 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో కోహ్లి క్రీజ్‌లోకి రావడంతో స్కోరు పుంజుకుంది. హార్దిక్ పాండ్యా వేసిన పదో ఓవర్లో మెకల్లమ్ 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో 20 పరుగులు రాబట్టాడు. ఇద్దరూ అదుపు తప్పిన బంతుల్ని బౌండరీలుగా మలచి స్కోరు బోర్డును పరుగెత్తించారు. మూడో వికెట్‌కు 5.5 ఓవర్లలో 60 పరుగులు జోడించాక మెకల్లమ్ లేని పరుగుకు ప్రయత్నించడం... హార్దిక్ పాండ్యా డైరెక్ట్ త్రోతో వికెట్లను గిరాటు వేయడం చకచకా జరిగిపోయాయి. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన మన్‌దీప్ (10 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. అతనితో పాటు కోహ్లి (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్)ని హార్దిక్ పాండ్యా వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చడంతో పాటు వాషింగ్టన్ సుందర్ (1) వికెట్‌నూ ఔట్ చేయడంతో బెంగళూరు ఇన్నింగ్స్ గతితప్పింది. మూడు వికెట్లు కోల్పోయిన చాలెంజర్స్ స్కోరు ఒక్కసారిగా మందగించింది. అయితే చివరి ఓవర్లో గ్రాండ్‌హోమ్ 3 భారీ సిక్సర్లతో జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. ముంబై బౌలర్లు మార్కండే, మెక్లీనగన్, బుమ్రా తలా ఒక వికెట్ తీశారు.
ఒకే ఒక్కడు హార్దిక్ పాండ్యా
ఏమంత కష్టసాధ్యం కానీ లక్ష్యమే అయినా... ముంబై బ్యాట్స్‌మెన్ ఆరంభంలోనే తడబడ్డారు. సౌతీ వేసిన తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత ఉమేశ్ యాదవ్ తన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ నాలుగోది)లో రెండు కీలక వికెట్లను తీసి ముంబైని ఆత్మరక్షణలో పడేశాడు. తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ (9)ను ఎల్బీగా వెనక్కి పంపిన ఉమేశ్ తర్వాతి బంతికి రోహిత్ శర్మ (0)ను కీపర్ క్యాచ్‌తో డకౌట్ చేశాడు. దీంతో 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన పొలార్డ్ (13), డుమిని (29 బంతుల్లో 23; 3 ఫోర్లు) కాసేపు నిలువగలిగారే కానీ లక్ష్యం దిశగా నడిపించలేకపోయారు. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం ఆఖరి ఓవర్‌దాకా కష్టపడ్డాడు. తన సోదరుడు కృనాల్ పాండ్యా (19 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి విజయం కోసం విఫలయత్నం చేశాడు. ఇద్దరు ఆరో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. సీమర్ సిరాజ్ 19 ఓవర్లో కృనాల్‌ను ఔట్ చేసి కేవలం 5 పరుగులే ఇవ్వడం బెంగళూరుకు కలిసొచ్చింది. దీంతో ఆఖరి ఓవర్లో 25 పరుగులు చేయాల్సివుండగా సౌతీ వేసిన తొలిబంతికే హార్దిక్ పాండ్యా నిష్క్రమించడంతో ముంబైకి మిగిలున్న ఆశలు ఆవిరయ్యాయి. హార్దిక్ లాంగాన్‌లో భారీషాట్ కొట్టగా కోహ్లి మెరుపువేగంతో డైవ్ చేసి క్యాచ్‌ను అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment