జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(80 నాటౌట్; 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరవగా, అజింక్యా రహానే(33), క్లాసెన్(32)లు ఫర్వాలేదనిపించడంతో రాజస్తాన్ గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను త్రిపాఠి, జోఫ్రా ఆర్చర్లు ఆరంభించారు. కాగా, ఆర్చర్ డకౌట్‌గా నిష్క్రమించడంతో రాజస్తాన్ రెండు పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో త్రిపాఠితో జత కలిసిన రహానే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించిన తర్వాత రహానే పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రహానే ఔటయ్యాడు. ఆపై మరుసటి బంతికే సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగిన సంజూ శాంసన్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. దాంతో త్రిపాఠి-క్లాసెన్‌లు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకున్నారు. ఈ జోడి 48 పరుగులు జత చేసిన తర్వాత క్లాసెన్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివరి ఓవర్లో కృష్ణప్ప గౌతమ్(14 నాటౌట్; 5 బంతుల్లో 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, మొహ్మద్ సిరాజ్ వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment