ఏబీ డివిలియర్స్
దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, ‘360 డిగ్రీస్ బ్యాట్స్‌మెన్’ ఏబీ డివిలియర్స్(34) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లో ఎన్నో సరికొత్త విన్యాసాలను ప్రదర్శిస్తూ అవలీలగా బంతులను సిక్సర్లుగా మలిచే డివిలియర్స్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్లు ఏబీ వెల్లడించాడు. తన నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపి క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేస్తూ, తన నిర్ణయాలనికి కారణాలు వెల్లడించాడు. 123 టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన డివిలియర్స్ 22 సెంచరీల సాయంతో 8,765 పరుగులు చేయగా, 228 వన్డేలాడిన ఏబీ 25 శతకాల సాయంతో 8,577 పరుగులు సాధించాడు. 78 అంతర్జాతీయ టీ20లు ఆడి 1,672 పరుగులు చేశాడు.
తన సమయం వచ్చేసిందని, నిజాయితీగా చెప్పాలంటే తాను అలసిపోయానని ఏబీ వెల్లడించాడు. ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇంటిదారి పట్టిన నాలుగు రోజుల అనంతరం ఏబీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్-11లో డివిలియర్స్ విఫలం కావడం బెంగళూరు విజయాలను అడ్డుకుంది. అయితే ఐపీఎల్ లాంటి టీ20 లీగ్స్‌కు ఏబీ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment