మైదానంలోకి దూసుకొచ్చి కోహ్లితో సెల్ఫీ దిగుతున్న ఓ అభిమాని
న్యూఢిల్లీ: బెంగళూరు గెలిచింది కానీ... ప్లే ఆఫ్ ఆశలకు ఇంకా దూరంగానే ఉంది. 11 మ్యాచ్‌లాడిన కోహ్లి సేనకిది నాలుగో విజయం మాత్రమే! శనివారం జరిగిన ఐపీఎల్ లీగ్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (34 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అభిషేక్ శర్మ (19 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయారు. చహల్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన బెంగళూరు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డివిలియర్స్ (37 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కోహ్లి (40 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. నేపాల్ ఆటగాడు సందీప్ లమిచానే, పంజాబ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ అరంగేట్రం చేశారు.
పంత్ పవర్ మళ్లీ...
ఢిల్లీ 16 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. పృథ్వీ షా (2), జాసన్ రాయ్ (12) ఇద్దర్నీ చహలే బౌల్డ్ చేశాడు. తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 32; 3 ఫోర్లు), రిషభ్ పంత్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 8వ ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులు దాటగా... పంత్ సిక్సర్ల ధాటికి 12వ ఓవర్లోనే స్కోరు వందకు చేరింది. 27 బంతుల్లోనే ఫిఫ్టీ (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసుకున్న రిషభ్... మొయిన్ అలీ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. దీంతో 93 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే అయ్యర్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. చివర్లో శంకర్ (21 నాటౌట్)తో కలిసిన అభిషేక్ శర్మ విరుచుకుపడటంతో భారీస్కోరు సాధ్యమైంది.
కోహ్లి, ఏబీ... ఫిఫ్టీ–ఫిఫ్టీ
ఢిల్లీలాగే బెంగళూరు ఓపెనర్లు మొయిన్ అలీ (1), పార్థివ్ (6) విఫలమయ్యారు. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా... కెప్టెన్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగుపెట్టించారు. ఈ క్రమంలో ఆరో ఓవర్లోనే జట్టు 50 పరుగులు, 11వ ఓవర్లోనే 100 పరుగులు చేసింది. కోహ్లి 26 బంతుల్లో అర్ధసెంచరీ (6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. తర్వాత భారీ షాట్లతో డివిలియర్స్ (28 బంతుల్లో; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ఈ జోడీ చెలరేగుతున్న దశలో కోహ్లిని మిశ్రా ఔట్ చేయడంతో 118 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత మన్‌దీప్ (13), సర్ఫరాజ్ (11) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా మిగతా లాంఛనాన్ని డివిలియర్స్ పూర్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment