ఢిల్లీ: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ మళ్లీ మోత మోగించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రసెల్ చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వచ్చీ రావడంతోనే బ్యాట్ ఝుళిపించాడు. కేకేఆర్ 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రసెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా బౌండరీలే లక్ష్యంగా ఆడాడు. అతనికి జతగా దినేశ్ కార్తీక్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు సాధించి జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. ఈ జోడి 95 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించడంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 185 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ దిగింది. కేకేఆర్ బ్యాటింగ్‌ను నిఖిల్ నాయక్, క్రిస్ లిన్‌లు ఆరంభించారు. అయితే నిఖిల్ నాయక్(7) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై కాసేపటికి రాబిన్ ఊతప్ప(11) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో కేకేఆర్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. దినేశ్ కార్తీక్ సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, మిగతా టాపార్డర్ ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టారు. అయితే రసెల్ వచ్చిన తర్వాత ఆట స్వరూపం మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రసెల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఓ దశలో రసెల్ ధాటికి బెంబెలేత్తిపోయిన ఢిల్లీ బౌలర్లు.. చివరకు అతని వికెట్ తీసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. క్రిస్ మోరిస్ వేసిన 18 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన రసెల్ ఔటయ్యాడు. అటు తర్వాత కార్తీక్ హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా, అమిత్ మిశ్రా, రబడా, లామ్‌చెన్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రాలు తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment