
ఇంగ్లండ్‌కు రష్యా చెక్
1-1తో మ్యాచ్ డ్రా ఠ యూరో కప్
మార్సిలే: దాదాపు మ్యాచ్ ఆద్యంతం ఇంగ్లండ్‌దే ఆధిపత్యం... దీనికి తోడు 1-0తో తమదే విజయం అనే ధీమా... యూరోలో శుభారంభం చేయడానికి మరో మూడు నిమిషాలు బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంటే చాలు... కానీ ఇదే సమయంలో ఊహించని విధంగా జట్టుకు షాక్ తగిలింది. రష్యా కెప్టెన్ వాసిలి బెరెజుట్‌స్కి ఇంజ్యురీ (90+2) సమయంలో చేసిన కీలక గోల్‌తో తమ జట్టును ఓటమి నుంచి తప్పించగా... అటు ఇంగ్లండ్ పూర్తి నిరాశలో మునిగిపోయింది. దీంతో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ తరఫున ఎరిక్ డియర్ (73వ నిమిషంలో) గోల్ సాధించాడు. అంతకుముందు ప్రథమార్ధంలో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా మిడ్‌ఫీల్డర్లు డీలే అల్లీ, ఆడమ్ లల్లానా రష్యా గోల్ పోస్టుపై ముమ్ముర దాడు చేశారు. మూడు, తొమ్మిదో నిమిషాల్లో అల్లీ గోల్ కోసం చేసిన ప్రయత్నాలు తృటిలో విఫలమయ్యాయి. ద్వితీయార్ధం 73వ నిమిషంలో రష్యన్ లెఫ్ట్ బ్యాక్ ఆటగాడు జియార్గి షెన్నికోవ్ ఇంగ్లండ్ మిడ్‌ఫీల్డర్ డీలే అల్లిని మొరటుగా అడ్డుకోవడంతో జట్టుకు ఫ్రీకిక్ లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఎరిక్ డియర్ కుడి కాలుతో సంధించిన బంతి నెట్ ఎడమవైపు పైభాగం నుంచి లోనికి వెళ్లింది. చివరి నిమిషాల్లో మాత్రం రష్యా జోరును కనబరిచింది. ఇంజ్యూరి టైమ్ ప్రారంభం కాగానే జియార్గి షెన్నికోవ్ అందించిన క్రాస్ షాట్‌ను బెరెజుట్‌స్కి హెడర్ ద్వారా బంతిని నెట్‌లోకి పంపడంతో రష్యా సంబరాల్లో మునిగింది.
రష్యా అభిమానుల దౌర్జన్యం
మ్యాచ్ ముగిసిన అనంతరం రష్యా అభిమానులు ఇంగ్లండ్ అభిమానులపైకి దాడికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ‘ఫిఫా’ విచారణకు ఆదేశించింది. అలాగే మరోసారి ఇరు జట్ల మధ్య ఇలాంటి గొడవలు జరిగితే యూరో నుంచి బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించింది.
టర్కీపై క్రొయేషియా విజయం
పారిస్: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తనకన్నా మెరుగైన స్థానంలో ఉన్న టర్కీని 1-0 తేడాతో క్రొయేషియా కంగుతినిపించింది. 41వ నిమిషంలో 25 గజాల దూరం నుంచి మోడ్రిక్ కుడి కాలితో సంధించిన సూపర్ వ్యాలీతో క్రొయేషియా బోణీ చేసింది.
పోలాండ్ శుభారంభం
నీస్: గ్రూప్ ‘సి’లో జరిగిన మ్యాచ్‌లో పోలాండ్ 1-0 తో నార్తర్న్ ఐర్లాండ్‌పై నెగ్గింది. 51వ నిమిషంలో అర్కాడిజ్ మిలిక్ పోలాండ్‌కు గోల్ అందించాడు.