ఖర్కీవ్‌లో రష్యా దాడుల్లో ధ్వంసమైన స్కూలు. (ఇన్‌సెట్‌లో) స్కూల్ మెట్లపై మృతదేహం
కీవ్: రష్యా పోరులో ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. అత్యాధునిక మధ్యశ్రేణి ఎం270 లాంచర్ రాకెట్ సిస్టమ్స్ అందజేస్తామని ఇంగ్లండ్ గురువారం ప్రకటించింది. 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే రాకెట్లను ఇవ్వనున్నట్లు తెలిపింది. రష్యా వైమానిక దాడులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్‌కు అయుధాలు ఇస్తామని అమెరికా, జర్మనీ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే.
అయితే ఈ ఆయుధాలు అందేలోపే డోన్బాస్‌ను రష్యా పూర్తిగా ఆక్రమించుకొనేలా కనిపిస్తోందని సైనిక నిపుణులటున్నారు. అమెరికా ఆయుధాలు, సైనిక శిక్షకులు రావడానికి మరో మూడు వారాల సమయం పడుతుంది. ఉక్రెయిన్‌కు మరింత ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తామని స్వీడన్ కూడా ప్రకటించింది. యాంటీ–షిప్ క్షిపణులు, రైఫిళ్లు, యాంటీ–ట్యాంకు ఆయుధాలు సరఫరా చేస్తామంది.
అమెరికా రాయబారిగా బ్రింక్
ఉక్రెయిన్‌లో అమెరికా కొత్త రాయబారిగా బ్రిడ్జెట్ బ్రింక్ నియమితులయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యూహాత్మక వైఫల్యంగా నిరూపిస్తానని ఆమె ఇటీవలే చెప్పారు.
మమ్మల్ని రెచ్చగొడుతున్నారు: రష్యా
పశ్చిమ దేశాలను మరిన్ని ఆయుధాలు కోరుతూ ఉక్రెయిన్ తమను నేరుగా రెచ్చగొడుతోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ దుయ్యబట్టరాఉ. ఈ ఆయుధాలతో యుద్ధం మరింత ఉధృతమవుతుందే తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు.
డోన్బాస్‌లో రష్యా దాడులు ఉధృతం
డోన్బాస్‌లో రష్యా దళాలు దూసుకెళ్తున్నాయి. సెవెరోడొట్స్‌క్‌లో 80 శాతానికి పైగా భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. లుహాన్‌స్క్‌పైనా పట్టు రష్యా బిగుస్తోంది. జాపొరిజాజియాలోని కోమిషువాఖా పట్టణాన్ని పుతిన్ సేనలు చుట్టుముట్టాయి. పశ్చిమ లెవివ్‌లో రష్యా క్షిపణి దాడుల్లో రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి. దీనివల్ల పశ్చిమ దేశాల నుంచి ఆయుధాల చేరవేతకు ఆటంకం కలుగనుంది.
రష్యన్‌గా భావించి ఉక్రెయిన్ వాసి హత్య
రష్యా పౌరుడిగా పొరపాటుపడి ఉక్రెయిన్ పౌరుడిని ఉక్రెయిన్ వాసి కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన అమెరికాలో జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లోని బ్రూక్లీన్ కరావోకే బార్‌లో ఒలెగ్ సులైమా(31) అనే వ్యక్తి మరో ఉక్రెయిన్ వలసదారుడిని ముఖం, మెడపై కత్తితో పొడిచి చంపేశాడు. బాధితుడు రష్యా భాషలో మాట్లాడడడంతో సులైమా పొరపాటుపడ్డాడని పోలీసులు చెప్పారు.
2 లక్షల చిన్నారులను అపహరించిన రష్యా: జెలెన్‌స్కీ
తమ దేశం నుంచి లక్షలాది పౌరులను ప్రత్యర్థి దేశం రష్యా అపహరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. వీరిలో 2 లక్షల మంది చిన్నారులున్నారని చెప్పారు. ఉక్రెయిన్ పౌరులు మాతృభూమిని మర్చిపోయేలా చేయాలన్నదే ఎత్తుగడ అన్నారు. తప్పు చేసిన వారిని తప్పనిసరిగా శిక్షించి తీరుతామన్నారు. రష్యాకు తమ సత్తా ఏమిటో యుద్ధ రంగంలోనే చూపిస్తామని జెలెన్‌స్కీ ప్రతినబూనారు.
ఉక్రెయిన్‌ను ఎవరూ ఆక్రమించలేరని, తమ ప్రజలు ఎవరికీ లొంగిపోరని, తమ చిన్నారులను ఆక్రమణదారుల సొంత ఆస్తిగా మారనివ్వబోమని తేల్చిచెప్పారు. రష్యా దాడుల్లో తమ దేశంలో ఇప్పటిదాకా అధికారికంగానే 243 మంది బాలలు మృత్యువాతపడ్డారని, 446 మంది గాయపడ్డారని, 139 మంది అదృశ్యమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా దాడుల్లో చనిపోయిన 11 మంది చిన్నపిల్లల పేర్లను జెలెన్‌స్కీ ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment