ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జి.రుత్విక శివాని మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జి.రుత్విక శివాని మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో రుత్విక 21-15, 21-12తో వుర్మ్ థెరిసా (జర్మనీ)పై గెలిచింది. 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రుత్విక స్మాష్‌ల ద్వారా 14 పాయింట్లు, నెట్‌వద్ద 16 పాయింట్లు సంపాదించింది.
తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన ఈ ఖమ్మం జిల్లా అమ్మాయి గురువారం జరిగే మూడో రౌండ్‌లో మరియా మిత్సోవా (బల్గేరియా)తో తలపడుతుంది. డబుల్స్ విభాగాలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు రావూరి సంతోష్, మేఘనలకు మిశ్రమ ఫలితాలు లభించాయి.
మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో సంతోష్ రావూరి-పూర్వీషా రామ్ జోడి 21-9, 26-24తో హసరంగ డిసిల్వా-భాగ్య డిసిల్వా (శ్రీలంక) జోడిపై; మేఘన-సాన్యామ్ శుక్లా జంట 21-9, 21-6తో అజిమోవ్-ముస్తకోవా (ఉజ్బెకిస్థాన్) ద్వయంపై గెలిచాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో రావూరి సంతోష్-చైతన్య రెడ్డి జోడి 8-21, 19-21తో కిమ్ జే వాన్-కిమ్ జుంగ్ హో (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది.