బౌలింగ్ కోచ్గా హారిస్!
సిడ్నీ:త్వరలో దక్షిణాఫ్రికాతో కీలక సిరీస్ నేపథ్యంలో మాజీ ఫాస్ట్ బౌలర్ రియాన్ హారిస్ను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే ఆసీస్ జట్టుకు ప్రధాన కోచ్ గా ఉన్న డారెన్ లీమన్, కొత్తగా నియమించబడ్డ అసిస్టెంట్ కోచ్ డేవిడ్ సాకర్తో కలిసి రియాన్ హారిస్ తన అనుభవాన్ని పంచుకుంటాడని సీఏ తెలిపింది.
ఈ తాజా నియామకంపై హారిస్ హర్షం వ్యక్తం చేశాడు. గతంలో అటు డారెన్ లీమన్తో పాటు, డేవిడ్ సాకర్ల నుంచి తాను ఎన్నోవిషయాలు నేర్చుకున్న సంగతిని గుర్తు చేసుకున్నాడు. ఇప్పడు వారితో కలిసి కోచ్ గా పని చేయడం ఒక అరుదైన అవకాశమని హారిస్ తెలిపాడు. తన జట్టుకు బౌలింగ్ కోచ్ గా చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఈ 36 ఏళ్ల మాజీ ఆటగాడు స్పష్టం చేశాడు. హారిస్ ను బౌలింగ్ కోచ్ గా నియమించడాన్ని లీమన్ స్వాగతించాడు. యువకులతో కూడిన తమ జట్టుకు ఆ ఇద్దరి సేవలు ఉపయోగపడతాయని లీమన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
గతేడాది తరచు మోకాలి గాయం బారిన పడిన హారిస్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే. తన టెస్టు కెరీర్లో 27 మ్యాచ్లాడిన హారిస్ 113 వికెట్లు తీశాడు. దాంతో పాటు గత సీజన్లో అండర్-19 ఆస్ట్రేలియా జట్టుకు హారీస్ కోచ్ గా వ్యవహరించాడు.