Ryan Harris
-
వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో ర్యాన్ హారిస్..
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ పంజాబ్ బౌలింగ్ కోచ్ పదవికి గత నెల్లో రాజీనామా చేసిన వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో ఆసీస్ మాజీ క్రికెటర్ ర్యాన్ హారిస్‌ను నియమించారు. ఈ మేరకు హారిస్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తూ కింగ్స్ పంజాబ్ యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2019 సీజన్‌కు సంబంధించి డిసెంబర్ 18వ తేదీన జైపూర్‌లో వేలం జరుగనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలువురు ఆటగాళ్లను వదులుకుని వేలానికి సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు.. సహాయక సిబ్బందిని నియమించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే ఇద్దరు విదేశీ మాజీ ఆటగాళ్లను కింగ్స్ పంజాబ్ తీసుకుంది. గతంలోనే క్రెయిగ్ మెక్‌మిల్లన్(న్యూజిలాండ్)ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించుకున్న పంజాబ్.. ఇప్పుడు ర్యాన్ హారిస్‌ను బౌలింగ్ కోచ్‌గా తెరపైకి తీసుకొచ్చింది. కింగ్స్ పంజాబ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా శ్రీదరన్ శ్రీరామ్ పని చేయనుండగా, ఫిజియోగా ఆసీస్‌కు చెందిన బ్రెట్ హార్రాప్ సపోర్టింగ్ స్టాఫ్‌లో చేరారు. హెడ్ కోచ్‌గా మైక్ హెసెన్ సేవలందించనుండగా, హై ఫెర్మామెన్స్ కోచ్‌గా ప్రసన్నా రామన్ పని చేయనున్నారు. -
బౌలింగ్ కోచ్‌గా హారిస్!
సిడ్నీ:త్వరలో దక్షిణాఫ్రికాతో కీలక సిరీస్ నేపథ్యంలో మాజీ ఫాస్ట్ బౌలర్ రియాన్ హారిస్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే ఆసీస్ జట్టుకు ప్రధాన కోచ్ గా ఉన్న డారెన్ లీమన్, కొత్తగా నియమించబడ్డ అసిస్టెంట్ కోచ్ డేవిడ్ సాకర్‌తో కలిసి రియాన్ హారిస్ తన అనుభవాన్ని పంచుకుంటాడని సీఏ తెలిపింది. ఈ తాజా నియామకంపై హారిస్ హర్షం వ్యక్తం చేశాడు. గతంలో అటు డారెన్ లీమన్‌తో పాటు, డేవిడ్ సాకర్ల నుంచి తాను ఎన్నోవిషయాలు నేర్చుకున్న సంగతిని గుర్తు చేసుకున్నాడు. ఇప్పడు వారితో కలిసి కోచ్ గా పని చేయడం ఒక అరుదైన అవకాశమని హారిస్ తెలిపాడు. తన జట్టుకు బౌలింగ్ కోచ్ గా చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఈ 36 ఏళ్ల మాజీ ఆటగాడు స్పష్టం చేశాడు. హారిస్ ను బౌలింగ్ కోచ్ గా నియమించడాన్ని లీమన్ స్వాగతించాడు. యువకులతో కూడిన తమ జట్టుకు ఆ ఇద్దరి సేవలు ఉపయోగపడతాయని లీమన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గతేడాది తరచు మోకాలి గాయం బారిన పడిన హారిస్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే. తన టెస్టు కెరీర్లో 27 మ్యాచ్‌లాడిన హారిస్ 113 వికెట్లు తీశాడు. దాంతో పాటు గత సీజన్లో అండర్-19 ఆస్ట్రేలియా జట్టుకు హారీస్ కోచ్ గా వ్యవహరించాడు. -
'వరల్డ్ టీ 20తో సమయం వృథా'
మెల్బోర్న్: త్వరలో భారత్‌లో జరగబోయే వరల్డ్ ట్వంటీ 20 సిరీస్ వల్ల సమయం వృథా తప్ప ఉపయోగం ఏమీ లేదని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ రాన్ హారిస్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ల ఎద్దడి ఎక్కువగా నేపథ్యంలో టీ 20 వరల్డ్ కప్ ను సమర్ధవంతంగా, అర్ధవంతంగా నిర్వహించడం కష్ట సాధ్యమన్నాడు. గత రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో జరిగిన వరల్డ్ కప్ నుంచి చూస్తే ఇప్పటివరకూ ఆసీస్ ఎనిమిది టీ 20 మ్యాచ్ లు మాత్రమే ఆడిందన్నాడు. 2015లో ఆసీస్ ఒక టీ 20 ఆడితే.. ఈ సంవత్సరం ఆరు మ్యాచ్ లు ఆడుతుందన్నాడు. ఈ ఏడాది భారత్ తో టీ 20 సిరీస్ ను ముగించుకున్న ఆసీస్ మూడు రోజుల వ్యవధిలో న్యూజిలాండ్ తో సిరీస్ కు సిద్ధం కావడం షెడ్యూల్లో ఉన్న బిజీని కనబరుస్తుందన్నాడు. ఇటువంటి తరుణంలో ఒక పెద్ద టోర్నీకి పూర్తి స్థాయి జట్టు సిద్ధంగా కావడం కష్టసాధ్యమన్నాడు. దీన్ని బట్టి చూస్తే రాబోయే టీ 20 వరల్డ్ కప్ ను సమయం వృథా టోర్నీగానే హారిస్ పేర్కొన్నాడు. -
క్రికెట్‌కు హ్యారిస్ వీడ్కోలు
లండన్: యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా పేసర్ రియాన్ హ్యారిస్ సంచలన నిర్ణ యం తీసుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కోసం జట్టుతో పాటే ఉన్న ఈ 35 ఏళ్ల ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. మోకాలి గాయం తిరగబెట్టడంతో ఎసెక్స్‌తో జరిగిన చివరి వార్మప్ మ్యాచ్‌లో తను ఆడలేదు. స్కానిం గ్లో అతడి కుడి మోకాలు బాగా దెబ్బతిన్నట్టు తేలింది. దీంతో ఇక క్రికెట్ నుంచి తప్పుకోవడమే మేలని భావించినట్టు హారిస్ తెలిపాడు. 2010లో అరంగేట్రం చేసిన తను 27 టెస్టుల్లో 113 వికెట్లు.. 21 వన్డేల్లో 44 వికెట్లు తీశాడు. హ్యారిస్ నిర్ణయంతో జట్టులోకి 22 ఏళ్ల పాట్ కమిన్స్‌ను తీసుకున్నారు. బుధవారం నుంచి తొలి టెస్టు జరుగుతుంది. -
ఆస్ట్రేలియా పేసర్ హారిస్ రిటైర్మెంట్
లండన్: ఆస్ట్రేలియా పేసర్ రియాన్ హారిస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు వెంటనే గుడ్ బై చెబుతున్నట్టు 36 ఏళ్ల హారిస్ ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. క్రికెట్ ఆడేందుకు ఇక తన శరీరం సహకరించదని, వైదొలగడానికి ఇదే సరైన సమయమని వెల్లడించాడు. హారిస్ రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. 2010లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన హారిస్ 27 మ్యాచ్‌ల్లో 113 వికెట్లు పడగొట్టాడు. ఇక 21 వన్డేల్లో 44, మూడు టి-20ల్లో4 వికెట్లు తీశాడు. -
మద్యం మత్తులో...
పెర్త్: చిత్తుగా తాగటం...ఆ తర్వాత గొడవలు పెట్టుకోవడమో, నోరు జారడమో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కొత్త కాదు. ఈ సారి పేసర్ ర్యాన్ హారిస్ వంతు. యాషెస్ గెలిచిన ఆనందంలో ఉన్న హారిస్ ట్విట్టర్లో అసభ్య వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన రాత్రి ‘స్థానిక క్రౌన్ కేసినో’లో అతడిని సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. హారిస్ బాగా ఎక్కువగా తాగి ఉండటమే అందుకు కారణం. జట్టు గెలుపు అనంతరం ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్ కంగారూ టీమ్‌కు పార్టీ ఇచ్చాడు. పార్టీలో బాగా తాగిన హారిస్, మరో పేసర్ కౌల్టర్ నీల్ అక్కడే ఉన్న కేసినోకి వెళ్లే ప్రయత్నం చేశారు. తమను అనుమతించకపోవడంతో హారిస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాగి ఉంటే కాసినోలోకి పంపించరా అంటూ ట్విట్టర్లో అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశాడు. దీనిపై అన్ని వైపులనుంచి తీవ్ర విమర్శలు రావడంతో అతడు తర్వాత దానిని తొలగించి క్షమాపణలు కూడా చెప్పాడు. ‘ ఆ ట్వీట్ పెట్టడం తప్పే. సెక్యూరిటీ గార్డ్లు సరిగ్గానే వ్యవహరించారు. తాగి ఉన్నప్పుడు ట్వీట్ చేయకూడదని తెలుసుకున్నాను’ అని హారిస్ అన్నాడు.