'వరల్డ్ టీ 20తో సమయం వృథా'
మెల్బోర్న్: త్వరలో భారత్లో జరగబోయే వరల్డ్ ట్వంటీ 20 సిరీస్ వల్ల సమయం వృథా తప్ప ఉపయోగం ఏమీ లేదని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ రాన్ హారిస్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ల ఎద్దడి ఎక్కువగా నేపథ్యంలో టీ 20 వరల్డ్ కప్ ను సమర్ధవంతంగా, అర్ధవంతంగా నిర్వహించడం కష్ట సాధ్యమన్నాడు.
గత రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో జరిగిన వరల్డ్ కప్ నుంచి చూస్తే ఇప్పటివరకూ ఆసీస్ ఎనిమిది టీ 20 మ్యాచ్ లు మాత్రమే ఆడిందన్నాడు. 2015లో ఆసీస్ ఒక టీ 20 ఆడితే.. ఈ సంవత్సరం ఆరు మ్యాచ్ లు ఆడుతుందన్నాడు. ఈ ఏడాది భారత్ తో టీ 20 సిరీస్ ను ముగించుకున్న ఆసీస్ మూడు రోజుల వ్యవధిలో న్యూజిలాండ్ తో సిరీస్ కు సిద్ధం కావడం షెడ్యూల్లో ఉన్న బిజీని కనబరుస్తుందన్నాడు. ఇటువంటి తరుణంలో ఒక పెద్ద టోర్నీకి పూర్తి స్థాయి జట్టు సిద్ధంగా కావడం కష్టసాధ్యమన్నాడు. దీన్ని బట్టి చూస్తే రాబోయే టీ 20 వరల్డ్ కప్ ను సమయం వృథా టోర్నీగానే హారిస్ పేర్కొన్నాడు.