కోల్‌కతా: అయ్యో..! మళ్లీ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి కష్టకాలం వచ్చినట్లుంది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్‌లో మొదలైన ఈ ట్రోఫీ ఆడుతూ... అటకెక్కుతూ వచ్చింది. ఒకసారి ఈ వన్డే టోర్నీ రద్దయిందంటారు. ఆపేస్తారు. మరోసారి... కొన్నేళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తామంటారు. ఆడిస్తారు. అలా సుదీర్ఘ విరామనంతరం గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ఈ ట్రోఫీ... 2021లో భారత్‌లో జరగాల్సి ఉంది. కానీ ఐసీసీ తాజా నిర్ణయం ప్రకారం ఈ ట్రోఫీ జరగడం లేదు. దీని స్థానంలో టి20 ప్రపంచకప్ నిర్వహిస్తారు. ఇక్కడ జరిగిన ఐదు రోజుల ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ల బోర్డు మీటింగ్‌లో టోర్నీల మార్పు ను ఖరారు చేశారు. ఐసీసీ సభ్యదేశాలన్నీ 8 జట్ల చాంపియన్స్ ట్రోఫీకి బదులు 16 జట్లు తలపడే ప్రపంచ టి20 టోర్నీకి ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవ్ రిచర్డ్‌సన్ వెల్లడించారు. బీసీసీఐ ప్రతినిధి అమితాబ్ చౌదరి కూడా టి20 మెగా ఈవెంట్‌కే మద్దతు పలికారు. దీంతో క్రికెట్ చరిత్రలో వరుసగా రెండేళ్లు ప్రపంచకప్ టి20 టోర్నీలు (2020–ఆస్ట్రేలియా, 2021 – భారత్) రెండోసారి జరుగనున్నాయి. 2009 (ఇంగ్లండ్), 2010 (వెస్టిండీస్)లో ఈ మెగా ఈవెంట్‌లు జరిగాయి. 2019, 2023లలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో మధ్యలో చాంపియన్స్ ట్రోఫీ అసమంజసమని ఐసీసీ సభ్య దేశాలు భావించాయి. అందుకే రద్దుచేసి టి20 ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు రిచర్డ్‌సన్ తెలిపారు.
అంతర్జాతీయం చేసేశారు...
ఇప్పటిదాకా శాశ్వత సభ్య దేశాలు(10) ఆడితేనే అంతర్జాతీయ హో దా ఉండేది. ఇకపై పొట్టి ఫార్మాట్‌లో ఆడే మ్యాచ్‌లన్నీ అంతర్జాతీయం కానున్నాయి. అంటే ఐసీసీలోని 104 సభ్యదేశాలు పొట్టి క్రికెట్ ఆడితే వాటిని అంతర్జాతీయ టి20గా పరిగణిస్తారు. ఈ జూలై 1 నుంచి మహిళల జట్లు, వచ్చే జనవరి 1 నుంచి పురుషుల జట్లు ఆడేవన్నీ అంతర్జాతీయ మ్యాచ్‌లే. పొట్టి ఫార్మాట్‌తో క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది.
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్?
లాస్ ఏంజిల్స్ ఆతిథ్యమిచ్చే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆటను చేర్చే అవకాశముంది. మెగా ఈవెంట్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కృషి చేస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్‌ను చూడొచ్చని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ వెల్లడించారు. పారిస్ (2024)లో జరిగే ఒలింపిక్స్‌లో కొత్త క్రీడలను చేర్చే తుదిగడువు ముగియడంతో తదుపరి ఈవెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.
చాంపియన్స్ ట్రోఫీకి చెల్లు
Published Fri, Apr 27 2018 12:48 AM | Last Updated on Fri, Apr 27 2018 12:48 AM
Comments
Please login to add a commentAdd a comment