కోల్‌కతా: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే ట్రోఫీల్లో చాంపియన్స్ ట్రోఫీ ఒకటి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ వన్డే ట్రోఫీ ఇక నుంచి కనిపించే అవకాశాలు లేనట్లే కనబడుతోంది. చాంపియన్స్ ట్రోఫీ స్థానంలో రెండు వరల్డ్ టీ 20ల జరపాలన్న ఐసీసీ గత నిర్ణయానికి తాజాగా తొలి అడుగుపడింది.
షెడ్యూల్ ప్రకారం 2021లో భారత్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. కాగా, ఆ ట్రోఫీ స్థానంలో టీ 20 వరల్డ్ కప్‌ను నిర్వహించడానికి ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ఐసీసీ గ్లోబల్ బాడీ ఏకగీవ్ర ఆమోదం తెలిపినట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ తెలిపారు. సాధారణంగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లకు మాత్రమే ఆడే అవకాశం ఉండగా, వరల్డ్ టీ 20 ద్వారా 16 జట్లను ఆడించేందుకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ‘ 2021లో భారత్‌లో జరగాల్సి ఉన్న చాంపియన్స్ ట్రోఫీ స్థానంలో వరల్డ్ టీ 20ని నిర్వహించనున్నాం. గేమ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఐసీసీ సభ్యత్వ దేశాల నుంచి ఆమోదం లభించింది’ అని నగరంలో జరిగిన వరల్ఢ్ క్రికెట్ బాడీ సమావేశం అనంతరం రిచర్డ్‌సన్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి బీసీసీఐ నుంచి ప్రాతినిథ్యం వహించిన అమితాబ్ చౌదరి.. అనుకూలంగా ఓటు వేయడంతో టీ20 వరల్డ్‌కప్ నిర్వహణకు ఏకగ్రీవ ఆమోద ముద్ర పడినట్లు రిచర్డ్‌సన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment