ర్యాన్ హారిస్
పెర్త్: చిత్తుగా తాగటం...ఆ తర్వాత గొడవలు పెట్టుకోవడమో, నోరు జారడమో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కొత్త కాదు. ఈ సారి పేసర్ ర్యాన్ హారిస్ వంతు. యాషెస్ గెలిచిన ఆనందంలో ఉన్న హారిస్ ట్విట్టర్‌లో అసభ్య వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన రాత్రి ‘స్థానిక క్రౌన్ కేసినో’లో అతడిని సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. హారిస్ బాగా ఎక్కువగా తాగి ఉండటమే అందుకు కారణం.
జట్టు గెలుపు అనంతరం ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్ కంగారూ టీమ్‌కు పార్టీ ఇచ్చాడు. పార్టీలో బాగా తాగిన హారిస్, మరో పేసర్ కౌల్టర్ నీల్ అక్కడే ఉన్న కేసినోకి వెళ్లే ప్రయత్నం చేశారు. తమను అనుమతించకపోవడంతో హారిస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాగి ఉంటే కాసినోలోకి పంపించరా అంటూ ట్విట్టర్‌లో అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశాడు. దీనిపై అన్ని వైపులనుంచి తీవ్ర విమర్శలు రావడంతో అతడు తర్వాత దానిని తొలగించి క్షమాపణలు కూడా చెప్పాడు. ‘ ఆ ట్వీట్ పెట్టడం తప్పే. సెక్యూరిటీ గార్డ్‌లు సరిగ్గానే వ్యవహరించారు. తాగి ఉన్నప్పుడు ట్వీట్ చేయకూడదని తెలుసుకున్నాను’ అని హారిస్ అన్నాడు.