‘మాస్టర్’కు మరో గౌరవం
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవలే వీడ్కోలు తీసుకున్న సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. రెండేళ్లపాటు దక్షిణాసియాకు యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ హోదాలో పరిశుభ్రత, పారిశుధ్యంపై అవగాహన పెంచే కార్యక్రమాల్లో సచిన్ పాల్గొననున్నాడు. ‘నా రెండో ఇన్నింగ్స్ ఇంత అద్భుతంగా సాగేలా అనుమతించినందుకు కృతజ్ఞతలు.
యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా సామర్థ్యం మేరకు పనిచేస్తాను. ఈ ఇన్నింగ్స్ నాకు చాలా చాలా ముఖ్యమైంది. అందుకే మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తాను. ప్రపంచ జనాభాలో 36 శాతం మంది సురక్షితమైన టాయిలెట్లను వినియోగించుకోలేకపోతున్నారు.
కనీన అవసరమైన ఈ సదుపాయం ఈరోజుల్లో కూడా లేకపోవడంపై అందరూ ఆలోచించాలి. సబ్బుతో చేతులు కడుక్కునే అవకాశం లేని బహిరంగ కాలకృత్యాలు కుటుంబానికి మంచిది కాదు. ఓ తల్లి ఇలా చేస్తే కుటుంబం మొత్తానికి హాని కలుగుతుంది. ఎందుకంటే ఆమె వంట చేయడంతో పాటు పిల్లలకు పాలివ్వడం కూడా చేస్తుంది. ఇలా అపరిశుభ్రంగా వ్యవహరిస్తే పిల్లల జీవితంపై ప్రభావం చూపుతుంది’ అని సచిన్ అన్నాడు. యునిసెఫ్ లెక్కల ప్రకారం మనదేశంలో సగం మంది బహిరంగంగా కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. చిన్నారులు తమ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోకపోవడంతో ప్రతీ రోజు 1600 మంది డయేరియా సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారని సచిన్ చెప్పాడు.
‘సచిన్‌ను పొగడటం మానండి’
ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత ఆటగాడిగా నీరాజనాలు అందుకున్న సచిన్ టెండూల్కర్‌ను పాకిస్థాన్ మీడియా కొనియాడటం ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ తాలిబాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనికి బదులు అంత మెరుగైన ఆటగాడు కానప్పటికీ పాక్ జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌ను పొగడాలని తాలిబాన్‌అధికార ప్రతినిధి షమీదుల్లా షాహిద్ సూచించాడు.
‘భారత్‌కు చెందిన సచిన్‌ను అతడి రిటైర్మెంట్ సందర్భంగా పాక్ మీడియా ఆకాశానికెత్తింది. వాస్తవానికి పాక్ ప్రజలు కూడా సచిన్‌ను పొగిడారు. అదే సమయంలో పాక్ కెప్టెన్ మిస్బా కెప్టెన్సీపై వ్యతిరేక కథనాలు ప్రసారం చేశారు. సచిన్ గొప్ప ఆటగాడైనప్పటికీ మీరు అతడిని ప్రస్తుతించవద్దు. దీనికి బదులుగా మిస్బాను కీర్తించాలి. ఎందుకంటే అతడు పాకిస్థానీ కాబట్టి’ అని షాహిద్ వీడియో సందేశంలో స్పష్టం చేశాడు. ఈనెల 16న క్రికెట్ నుంచి తప్పుకున్న సచిన్‌పై దక్షిణాసియా మీడియా విపరీతమైన కథనాలు ప్రసారం చేసింది.