సచిన్‌ భావోద్వేగ ట్వీట్‌ | Sachin Tendulkar Emotional Tribute For Ramakant Achrekar | Sakshi
Sakshi News home page

మీరు మా గుండెల్లో ఉంటారు సార్‌: సచిన్‌

Published Thu, Jan 2 2020 3:25 PM | Last Updated on Thu, Jan 2 2020 3:37 PM

Sachin Tendulkar Emotional Tribute For Ramakant Achrekar - Sakshi

ముంబై: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన గురువు రమాకాంత్‌ ఆచ్రేకర్‌కు నివాళులు అర్పించాడు. ఆచ్రేకర్‌ తొలి వర్ధంతిని పురస్కరించుకుని.. ‘ మీరు ఎల్లప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు ఆచ్రేకర్‌ సర్‌’ అంటూ భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా తన గురువుతో కలిసి దిగిన పాత ఫొటోను షేర్‌ చేశాడు. ఇక వినోద్‌ కాంబ్లీ సైతం ఆచ్రేకర్‌ను గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు.. ‘ అసలు మీలాంటి మెంటార్‌ ఎవరికీ దొరకరు. కేవలం క్రికెట్‌ ఎలా ఆడాలో నేర్పడమే కాకుండా... నాకు జీవిత పాఠాలు కూడా బోధించారు. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా ఆచ్రేకర్‌ సర్‌’ అని ట్వీట్‌ చేశాడు. 

కాగా కేవలం ఒకే ఒక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడినప్పటికీ తదనంతర కాలంలో గొప్ప కోచ్‌గా ఎదిగిన రమాకాంత్‌ ఆచ్రేకర్‌ గతేడాది జనవరి 2న కన్నుమూసిన విషయం విదితమే. సచిన్‌, వినోద్‌ కాంబ్లి, ప్రవీణ్‌ ఆమ్రే వంటి ఎంతో మంది క్రికెటర్లను తీర్చిదిద్దిన ఆయనను ద్రోణాచార్య అవార్డు వరించింది.  2010లో ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా దక్కింది. ఇక తనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి.. స్కూటర్‌పై తనను ప్రాక్టీసుకు తీసుకువెళ్లిన ఆచ్రేకర్‌ అంటే సచిన్‌కు ఎంతో గౌరవం. ఈ క్రమంలో తనకు ఆచ్రేకర్‌తో ఉన్న అనుబంధం గురించి సచిన్‌ పలు వేదికలపై చెప్పుకొచ్చాడు. ఆచ్రేకర్‌ అనారోగ్యంతో బాధ పడుతున్న సమయంలో పలుమార్లు ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పాడు. ఇక వినోద్‌ కాంబ్లి కూడా వీలు చిక్కినప్పుడల్లా ఆచ్రేకర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటాడు.(చదవండి : నా వీడియోను షేర్‌ చేసిన సచిన్‌కు థాంక్స్‌)

సచిన్‌ గురువుగా గుర్తింపు..
దాదర్‌ ప్రాంతంలోని శివాజీ పార్క్‌లో అచ్రేకర్‌ క్రికెట్‌ అకాడమీ ఉండేది. ఆయన ఎంత మందికి శిక్షణనిచ్చినా ‘సచిన్‌ గురువు’గానే క్రికెట్‌ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంది. సచిన్‌ కూడా తన సుదీర్ఘ కెరీర్‌లో లెక్క లేనన్ని సార్లు తన గురువును గుర్తు చేసుకునేవాడు. ఓనమాలు నేర్పిన నాటినుంచి తన చివరి టెస్టు ఆడే వరకు ప్రతీ దశలో ఆయన పాత్ర, ప్రభావం గురించి చెప్పడం టెండూల్కర్‌ ఏనాడూ మర్చిపోలేదు. క్రికెట్‌లో ఎదగాలంటే అప్పటి వరకు చదువుతున్న న్యూ ఇంగ్లీష్‌ స్కూల్‌ నుంచి శారదాశ్రమ్‌ విద్యామందిర్‌కు మారమని అచ్రేకరే తన శిష్యుడికి సూచించారు. ప్రతి ఏటా గురుపూర్ణిమ రోజున తన గురువును కలిసి ఆశీర్వచనాలు తీసుకోవడం సచిన్‌ అలవాటుగా ఉండేది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement