‘మాస్టర్’ మనసున్న మారాజు
న్యూఢిల్లీ: సచిన్ కేవలం జగం మెచ్చిన క్రికెటరే కాదు... జనం కోసం పాటుపడే వ్యక్తి కూడా అని అతని అత్త అనాబెల్ మెహతా తెలిపారు. సామాజిక సేవల్లోనూ అతనిది ముందుండే వ్యక్తిత్వమని చెప్పారు. ముఖ్యంగా ముంబై మురికివాడల్లోని చిన్నారుల విద్య కోసం తన అల్లుడు పరితపించాడన్నారు. తాను నెలకొల్పిన స్వచ్ఛంద సేవ సంస్థ ‘అప్నాలయా’కు అన్నీ తానై సచిన్ వ్యవహరించాడని ఆమె చెప్పారు.
ఆమె 40 ఏళ్లుగా ఈ సంస్థను నడిపిస్తున్నారు. తన తండ్రి రమేశ్ టెండూల్కర్ స్మారకార్థం విద్యార్థులకు చక్కని సదుపాయాలు కల్పించాడని మెహతా చెప్పారు. ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో సచిన్ ఒకడు. ఇందులో సందేహమే లేదు. సమున్నత వ్యక్తిత్వంలోనూ అతనికి అతనే సాటి. తన తండ్రి మార్గదర్శనమో, లేక ప్రభావమో గానీ... టెండూల్కర్ కుటుంబానికి ఎంతో విలువిస్తాడు, అవసరమైతే సమాజానికి అండగా నిలవాలనుకుంటాడు’ అని అంజలి తల్లి మెహతా చెప్పారు. సచిన్ రిటైర్మెంట్‌ను తమ అప్నాలయా చిన్నారులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు.