
ముంబై: సరిగ్గా ఆరేళ్ల క్రితం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి మ్యాచ్ సందర్భంగా భావోద్వేగ ప్రసంగం చేశాడు. ఆ రోజు మాట్లాడుతుండగానే అతని కళ్లల్లో నీళ్లు తిరగడం భారత క్రికెట్ అభిమానులెవరూ మరచిపోలేరు. ఆ సమయంలో తన మనసులో ఎన్నో ఆలోచనలు చెలరేగుతుండటం వల్ల తనను తాను నియంత్రించుకోలేకపోయానని సచిన్ గుర్తు చేసుకున్నాడు. ‘ఆ సమయంలో కన్నీళ్లను ఆపాలని నేను ప్రయతి్నంచలేదు. మగాళ్లయినా సరే... నా దృష్టిలో కన్నీళ్లను దాచనవసరం లేదు.
కన్నీళ్లు బయటకు రావడం సిగ్గు పడాల్సిన విషయమేమీ కాదు. కష్టాలు చుట్టుముట్టినా బలవంతంగా నటించడం ఎందుకు? మన సమాజంలో మగాళ్లు అసలు ఏడవరాదని, వారు బలహీనులని ప్రచారంలో ఉంది. నేనూ అదే నమ్ముతూ పెరిగాను. కానీ అది తప్పని నాకు అర్థమైంది. నా పోరాటం, బాధలే నన్ను ఇంతటివాడిని చేశాయి’ అని సచిన్ అన్నాడు. ‘ఇంటర్నేషనల్ మెన్స్ వీక్’ సందర్భంగా పురుష ప్రపంచానికి రాసిన బహిరంగ లేఖలో అతను ఇదంతా వివరించాడు.