చివరి మ్యాచ్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సెంచరీ ఆశలు నెరవేరకపోయినా మొత్తమ్మీద ఆకట్టుకున్నాడు. సచిన్ చరిత్రాత్మక 200వ టెస్టు, వీడ్కోలు మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు పరుగుల కనువిందు చేశాడు. వెస్టిండీస్‌తో ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో మాస్టర్ (118 బంతుల్లో 12 ఫోర్లతో 74) హాఫ్ సెంచరీ చేశాడు. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ముంబైకర్ ఓ దశలో సెంచరీపై ఆశలు రేకెత్తించాడు. అయితే డియోనరైన్ బౌలింగ్‌లో ఆడబోయిన సచిన్ బంతి ఎడ్జ్ తీసుకోవడంతో స్లిప్‌లో సామీకి క్యాచ్ ఇచ్చాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఏదేమైనా సచిన్ నాలుగు పదుల వయసులో తన చివరి టెస్టులో కుర్రాళ్లతో పోటీపడి ఆడటం అభిమానుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
తొలిరోజు చివర్లో బ్యాటింగ్‌కు దిగిన సచిన్ ఆట ముగిసేసరికి (38) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండో రోజు ఉదయం అతనితో పాటు పుజారా (34) తొలి ఇన్నింగ్స్ కొనసాగించారు. మొదటి రెండు బంతుల్లో పరుగులేమీ రాకపోయినా.. తర్వాత వరుసగా రెండు బంతులను సచిన్ బౌండరీకి తరలించడంతో ప్రేక్షకుల్లో ఆనందోత్సాహాలు చెలరేగాయి. టినో బెస్ట్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి సచిన్ దాదాపు ఔటైనంత పని జరిగినా.. తృటిలో ప్రమాదం తప్పింది. షార్ట్ లెంగ్త్ బాల్‌ను సచిన్ ఫ్లాష్ చేయడానికి ప్రయత్నించాడు గానీ అది కొద్దిలో తప్పిపోయింది. దీంతో ప్రేక్షకులంతా ఊపిరి పీల్చుకున్నారు. షిల్లింగ్ ఫోర్డ్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతిని సచిన్ బౌండరీకి తరలించడంతో మాస్టర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. హాఫ్ సెంచరీ తర్వాత మాస్టర్ మరింత దూకుడు పెంచాడు. మరో మూడు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. జోరుమీదున్న సచిన్ డియోనరైన్ బౌలింగ్‌లో అవుటవడంతో నిష్ర్కమించాడు.
ఈ ఇన్నింగ్స్ అభిమానులకు, మాస్టర్‌కు తీపి గుర్తుగా మిగిలిపోతోంది. ఆతిథ్యమిచ్చినందుకు సచిన్ సొంతగడ్డ ముంబై వాంఖడే స్టేడియానికి సార్థకత చేకూరింది. కాగా విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 182 పరుగులకే కుప్పకూలగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. కరీబియన్లు రెండో ఇన్నింగ్స్ లోనూ చేతులెత్తేస్తే ధోనీసేన ఇన్నింగ్స్ విజయం సాధించే అవకాశముంది. అదే జరిగితే మాస్టర్ బ్యాటింగ్ ను మరోసారి చూసే అవకాశం ఉండదు. ఇదే అతనికి చివరి ఇన్నింగ్స్ అవుతుంది.