ప్రపంచకప్ ప్రచారకర్తగా...
⇒ వరుసగా రెండోసారి ‘మాస్టర్’ ఎంపిక
⇒ ఐసీసీ ప్రకటన
దుబాయ్: వరుసగా రెండోసారి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్... వన్డే ప్రపంచకప్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు (2,278) సాధించిన ఆటగాడిగా సచిన్‌కు పేరుంది. 2003 టోర్నీలో 673 పరుగులతో అతను ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. ‘ఐసీసీ ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాలను ప్రచారకర్త హోదాలో సచిన్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు జరిగే ఈ టోర్నీ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఈవెంట్’ అని ఐసీసీ తెలిపింది.
మరోవైపు ఈ హోదాపై సచిన్ హర్షం వ్యక్తం చేశాడు. ‘వరుసగా రెండోసారి ప్రపంచకప్ అంబాసిడర్‌గా నియమించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఓ ఆటగాడిగా ఆరు టోర్నీలు ఆడిన అనంతరం ఈసారి జరిగే ఈవెంట్ నాకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. 1987 ప్రపంచకప్‌లో ‘బాల్ బాయ్’గా బయటి నుంచి చూసినట్టే ఈసారి కూడా అలాగే చూడాలి. ఏ జట్టైనా ప్రపంచకప్ గెలుచుకుంటే అది చాలా మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా ఉంటుంది. కప్ సాధించాలనే కలను నేను 22 ఏళ్ల నిరీక్షణ తర్వాత తీర్చుకున్నాను’ అని 41 ఏళ్ల సచిన్ అన్నాడు.