లాహ్లీకి లక్కీ చాన్స్
లాహ్లీకి లక్కీ చాన్స్
Published Tue, Oct 22 2013 1:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
చండీగఢ్: సచిన్ టెండూల్కర్ చివరి రెండు టెస్టులకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్‌కతా, ముంబై సొంతం చేసుకున్నాయి. ఇక మాస్టర్ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం మిగిలిన నగరాలకు లేదు. కానీ హర్యానాలోని లాహ్లీ అనే చిన్న పట్టణానికి మాత్రం ఈ లక్కీ చాన్స్ దొరికింది. మాస్టర్ బ్లాస్టర్ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈ పట్టణ వాసులకు దక్కనుంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహకంగా ఈ నెల 27 నుంచి 30 వరకు హర్యానాతో జరిగే రంజీ మ్యాచ్‌లో ముంబై తరఫున సచిన్ ఆడుతున్నాడు. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా పరిధిలో ఉన్న లాహ్లీ అనే చిన్న పట్ణణం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇక్కడి బన్సీలాల్ స్టేడియం సామర్థ్యం కేవలం 8 వేలే కావడం గమనార్హం. దిగ్గజ ఆటగాడైన సచిన్ తమ రాష్ట్రంలో ఆడనుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రణ్‌బీర్ మహేంద్ర అన్నారు. ‘మరో కొద్ది రోజుల్లో కెరీర్‌కు ముగింపు పలకబోతున్న సచిన్ ఇక్కడ ఆడనుండడం హర్యానాకు, హర్యానా క్రికెట్ సంఘానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. అతడు కెరీర్ ఆరంభించినప్పుడు నేను బోర్డు కార్యదర్శిగా ఉన్నాను. 1991-92లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు మేనేజర్‌గా పనిచేశాను. అలాగే 20 ఏళ్ల అనంతరం 2011లో జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లినప్పుడు నా కుమారుడు అనిరుధ్ చౌధురి మేనేజర్‌గా వ్యవహరించాడు. దీనికి మేం అదష్టవంతులం అనుకోవాలి’ అని రణ్‌బీర్ తెలిపారు.
Advertisement
Advertisement