Ranji Trophy match
-
'ఏంటి రహానే మరి మారవా.. మళ్లీ డకౌట్ అయ్యావా'
టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు రహానేతో పాటు చతేశ్వర్ పుజారాను కూడా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో రహానే నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గోవాతో ముంబై జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన లక్ష్యా గార్గ్ బౌలింగ్‌లో.. రహానే ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ పృథ్వీ షా కూడా 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కాగా భారత జట్టులో రహానే తిరిగి స్ధానం దక్కించుకోవాలంటే తాను ఎంటో మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత జట్టులోకి రావడం కష్టమనే చెప్పుకోవాలి. అయితే ఈ ఏడాది రంజీ సీజన్లో సౌరాష్ట్రతో జరగిన తొలి మ్యాచ్‌లో రహానే సెంచరీ సాధించాడు. దీంతో ఫామ్‌లోకి అతడు వచ్చాడని అంతా భావించారు. అయితే గోవాతో జరుగుతోన్న మ్యాచ్‌లో రహానే డకౌట్ అయ్యి మళ్లీ అందరనీ నిరాశపరిచాడు. దీంతో సోషల్ మీడియాలో మరో సారి రహానే ఆటతీరుపై నెటిజన్లు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "ఏంటి రహానే మరి మారవా.. మళ్లీ డకౌట్ అయ్యావా" అంటు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IND vs SL: 'టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ వద్దు... అతడికి అవకాశం ఇవ్వండి' -
ఆంధ్ర 255 ఆలౌట్
సాక్షి, ఒంగోలు: కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించింది. ఇక్కడి సీఎస్ఆర్ శర్మ కాలేజి మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 57/1తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర 255 పరుగులకు ఆలౌటైంది. డీబీ ప్రశాంత్ కుమార్ (237 బంతుల్లో 79; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ఉప్పర గిరినాథ్ (134 బంతుల్లో 41; 5 ఫోర్లు), కె. నితీశ్ కుమార్ రెడ్డి (60 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. కెపె్టన్ రికీ భుయ్ (0) తొలి బంతికే అవుటయ్యాడు. కేరళ బౌలర్లలో బాసిల్ థంపి, జలజ్ సక్సేనా చెరో 3 వికెట్లు పడగొట్టారు. కేరళ సోమవారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆంధ్రకు 93 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. -
ఇషాంత్‌ను వెంటాడిన గాయం!
న్యూఢిల్లీ: కీలకమైన న్యూజిలాండ్ పర్యటనకు భారత సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ దాదాపుగా దూరమైనట్లే. రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా సోమవారం ఇషాంత్ శర్మకు గాయం కాగా... వైద్య పరీక్ష అనంతరం దాని తీవ్రత ఎక్కువేనని తేలింది. ‘ఇషాంత్ ఎంఆర్ఐ రిపోర్టు ప్రకారం అతని చీలమండలో గ్రేడ్ త్రీ పగులు వచ్చినట్లు తేలింది. ఇది చాలా తీవ్రమైంది. అతనికి కనీసం ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస చికిత్స తీసుకోవడం కూడా తప్పనిసరి’ అని ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) కార్యదర్శి వినోద్ తిహారా వెల్లడించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫిబ్రవరి 21న తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటికి ఇషాంత్ కోలుకోవడం కష్టమే. ఇషాంత్ గాయంపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అతనికి మరోసారి పరీక్షలు నిర్వహించిన తర్వాతే బోర్డు ఈ విషయంలో స్పందించవచ్చు. -
మైదానంలో పాము.. నిలిచిపోయిన మ్యాచ్
సాక్షి, అమరావతి: విజయవాడలోని మూలపాడులో సోమవారం నుంచి క్రికెట్ సందటి మొదలైంది. ఆంధ్ర- విదర్భ జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. అయితే మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సమయానికి ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ సాగుతున్న సమయంలో మైదానంలోకి ఓ పాము ప్రవేశించింది. దీంతో నిర్వహకులు మ్యాచ్‌ను మధ్యలోనే కొద్ది సమయం పాటు ఆటను నిలిపివేశారు. పామును మైదానం నుంచి బయటకు పంపుటకు అక్కడి సిబ్బంది నానా తంటాలు పడ్డారు. ఈ వీడియోను బీసీసీఐ స్వయంగా తన అధికారి ట్విటర్ ద్వారా క్రికెట్ అభిమానులతో పంచుకుంది. కాగా ఆంధ్ర జట్టుకు టీమిండియా ఆటగాడు హనుమ విహారి, విదర్భ జట్టుకు ఫయాజ్ ఫజల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. SNAKE STOPS PLAY! There was a visitor on the field to delay the start of the match. Follow it live - https://t.co/MrXmWO1GFo#APvVID @paytm #RanjiTrophy pic.twitter.com/1GptRSyUHq — BCCI Domestic (@BCCIdomestic) December 9, 2019 -
307 పరుగుల తేడాతో నెగ్గిన ఆంధ్ర
ఇండోర్: తొలి ఇన్నింగ్స్‌లో గిరినాథ్ రెడ్డి (6/29) హడలెత్తించగా... రెండో ఇన్నింగ్స్‌లో ఆ బాధ్యతను కోడిరామకృష్ణ వెంకట (కేవీ) శశికాంత్ (6/18) తీసుకున్నాడు. ఫలితంగా 2018–19 రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర జట్టు ఘనవిజయంతో ముగించింది. గ్రూప్ ‘బి’ టాపర్ మధ్యప్రదేశ్‌తో వారి గడ్డపైనే జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 307 పరుగుల ఆధిక్యంతో జయభేరి మోగించింది. బౌలర్ల విజృంభణ కారణంగా మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ ఫలితంతో ఆంధ్రకు ఆరు పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా తొమ్మిది జట్లున్న గ్రూప్ ‘బి’లో నిర్ణీత ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఒక విజయం, రెండు పరాజయాలు, ఐదు ‘డ్రా’లతో మొత్తం 17 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 198/7తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 301 పరుగులవద్ద ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కరణ్ షిండే (215 బంతుల్లో 103 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించి ఆంధ్రను ఆదుకున్నాడు. కరణ్ షిండే తొమ్మిదో వికెట్‌కు మనీశ్ (67 బంతుల్లో 21; 2 ఫోర్లు)తో 53 పరుగులు... పదో వికెట్‌కు విజయ్ కుమార్ (27 బంతుల్లో 10; 2 ఫోర్లు)తో 50 పరుగులు జోడించడం విశేషం. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఈశ్వర్ పాండేకు మూడు వికెట్లు దక్కగా... గౌరవ్ యాదవ్, కుల్దీప్ సేన్, శుభం శర్మలకు రెండేసి వికెట్లు లభించాయి. 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ను ఆంధ్ర పేస్ బౌలర్లు శశికాంత్, విజయ్ కుమార్ నిప్పులు చెరిగే బంతులతో వణికించారు. దాంతో మధ్యప్రదేశ్ 16.5 ఓవర్లలో కేవలం 35 పరుగులకే కుప్పకూలి దారుణంగా ఓడిపోయింది. శశికాంత్ 8 ఓవర్లలో 4 మెయిడిన్లు వేసి 18 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగా... విజయ్‌కుమార్ 8.5 ఓవర్లలో 3 మెయిడిన్లు వేసి 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మధ్యప్రదేశ్ నుంచి చివరి బ్యాట్స్‌మన్ గౌరవ్ యాదవ్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. శశికాంత్, విజయ్ ధాటికి మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదుగురు ఖాతా తెరవలేదు. ఆర్యమాన్ బిర్లా (12; 2 ఫోర్లు), యశ్ దూబే (16; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. -
ఆంధ్ర భారీ స్కోరు
సాక్షి, విజయనగరం: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రికీ భుయ్ (248 బంతుల్లో 129; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోన శ్రీకర్ భరత్ (277 బంతుల్లో 178 నాటౌట్; 22 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో... హైదరాబాద్‌తో జరుగుతున్న గ్రూప్ ‘బి’ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 231 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఓవర్‌నైట్ స్కోరు 207/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర ఏడు వికెట్లకు 502 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఆ జట్టు 198 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం తన్మయ్ (13 బ్యాటింగ్), తిలక్ వర్మ (20 బ్యా టింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు చివరి రోజు. -
రికీ భుయ్ అజేయ సెంచరీ
సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పట్టుదలతో పోరాడటంతో... పంజాబ్‌తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పుంజుకుంది. రికీ భుయ్ (291 బంతుల్లో 151 బ్యాటింగ్; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీకి తోడు... కేఎస్ భరత్ (175 బంతుల్లో 76; 6 ఫోర్లు, 1 సిక్స్), సుమంత్ (124 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా బాధ్యతాయుతంగా ఆడటంతో శనివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. రోజంతా బౌలింగ్ చేసిన పంజాబ్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 54/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టును కేఎస్ భరత్‌తో కలిసి భుయ్ ఆదుకున్నాడు. ఈ జోడీ కుదురుకునే వరకు జాగ్రత్తగా ఆడి ఆ తర్వాత ఎదురుదాడి చేసింది. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 151 పరుగులు జోడించాక మయాంక్ మార్కండే (3/96) బౌలింగ్‌లో భరత్ ఔటయ్యాడు. ఆ తర్వాత సుమంత్‌తో కలిసి భుయ్ ఐదో వికెట్‌కు 132 పరుగులు జోడించాడు. ప్రస్తుతం అతని పాటు కరణ్ శర్మ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (414)కు ఆంధ్ర ఇంకా 86 పరుగుల దూరంలో ఉంది. మ్యాచ్‌కు ఆదివారం చివరి రోజు. హైదరాబాద్ 30/1 కేరళ, హైదరాబాద్ జట్ల మధ్య తిరువనంతపురంలో జరుగుతోన్న మరో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మూడో రోజు 20 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (3) త్వరగా ఔటయ్యాడు. తన్మయ్ (24 బ్యాటింగ్; 4 ఫోర్లు), రోహిత్ రాయుడు (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
శుబ్‌మన్ అర్ధ సెంచరీ
సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2018–19 సీజన్‌ను రెండు తెలుగు జట్లు సానుకూలంగా ప్రారంభించాయి. గురువారం ఇక్కడ పంజాబ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆంధ్ర జట్టు ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. శుబ్‌మన్ గిల్ (56), కెప్టెన్ మన్దీప్ సింగ్ (68), సన్వీర్ సింగ్ (63 బ్యాటింగ్) అర్ధశతకాలతో చెలరేగడంతో పంజాబ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. బండారు అయ్యప్ప 3 వికెట్లు పడగొట్టాడు. సంజు, సచిన్ బేబీ అర్ధ శతకాలు కేరళ, హైదరాబాద్ జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా ఆరంభమైన మరో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ... జలజ్ సక్సేనా (57), సంజు శామ్సన్ (53), కెప్టెన్ సచిన్ బేబీ (57 బ్యాటింగ్) అర్ధ సెంచరీలతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసింది. సిక్కిం 15/5నుంచి 299/9కు... కోల్‌కతా: మణిపూర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక దశలో సిక్కిం స్కోరు 15/5. రంజీల్లో అత్యల్ప స్కోరు (21) రికార్డు కనుమరుగవుతున్నట్లు కనిపించింది. అయితే మిలింద్ కుమార్ (248 బంతుల్లో 202 బ్యాటింగ్; 29 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఏకంగా డబుల్ సెంచరీతో జట్టును గట్టె క్కించాడు. ఫలితంగా తొలి రోజు స్కోరు 299/9కు చేరింది. రంజీ కబుర్లు ►ఢిల్లీలో ముంబై, ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా కాలుష్యానికి తట్టుకోలేక పలువురు ఆటగాళ్లు మాస్క్‌లతోనే బరిలోకి దిగారు. ►ముంబై తరఫున సిద్దేశ్ లాడ్ మ్యాచ్ ఆడుతుండగా... ప్రత్యర్థి రైల్వేస్ జట్టు తరఫున పరిశీలకుడిగా వచ్చిన అతని తండ్రి దినేశ్ లాడ్ కొడుకును ఔట్ చేసేందుకు వ్యూహ రచన చేయడం విశేషం. ►డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్, బిహార్ జట్ల మధ్య మ్యాచ్‌కు కెమెరాలు లేకపోవడంతో ఈ మ్యాచ్ థర్డ్ అంపైర్ లేకుండానే సాగుతోంది ► రైనా స్థానంలో యూపీ జట్టులోకి వచ్చిన అ„Š దీప్ నాథ్ యో యో టెస్టులో విఫలమైనట్లు బుధవారమే తేలినా... అతనికి కెప్టెన్సీ సహా జట్టులో చోటివ్వడం వివాదం రేపింది. ►నాగాలాండ్ తరఫున ఆడుతున్న ఇమ్లీవతీ లేమూర్ వృత్తిరీత్యా పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు. రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు జీతంలేని సెలవుతో ప్రత్యేక అనుమతి తీసుకున్నాడు. ► అరుణాచల్ ప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన సందీప్ కుమార్ ఠాకూర్ వృత్తి రీత్యా క్రీడా పాత్రికేయుడు. ఆట ముగియగానే అతను తన పత్రిక ‘అరుణాచల్ ఫ్రంట్’కు మ్యాచ్ రిపోర్ట్ పంపిస్తాడు. అందులో అతని పేరు రాసుకోవాల్సి రావడం విశేషం. -
వారెవ్వా విదర్భ
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్...కర్ణాటక విజయానికి మరో 87 పరుగులు కావాలి... విదర్భ తొలిసారి ఫైనల్ చేరేందుకు మరో 3 వికెట్లు తీయాలి...కర్ణాటక లోయర్ ఆర్డర్ పోరాడుతోంది...మరో వికెట్ కోల్పోయినా 78 పరుగులు వచ్చేశాయి... ఇక చేతిలో 2 వికెట్లతో చేయాల్సింది 9 పరుగులే...ఈ దశలో మ్యాచ్‌లో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది... కావాల్సినంత సమయం కర్ణాటకకు ఉండగా, విదర్భ దాదాపు మ్యాచ్ చేజార్చుకున్నట్లే అనిపించింది... అయితే ఒత్తిడిలో చిత్తయిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మిథున్ కొట్టిన తప్పుడు షాట్ విదర్భకు దారి చూపించింది. మరో 3 పరుగులకే చివరి వికెట్ కూడా తీసి ఆ జట్టు చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. రజనీశ్ గుర్బాని అద్భుత బౌలింగ్‌తో ముందుండి నడిపించగా తొలిసారి రంజీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. కోల్‌కతా: తొలి రోజు నుంచి ఆధిక్యం చేతులు మారి విజయం దోబూచులాడుతూ వచ్చిన మ్యాచ్‌లో చివరకు గెలుపు విదర్భను వరించింది. గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో ముగిసిన రంజీ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో విదర్భ 5 పరుగుల తేడాతో కర్ణాటకను ఓడించింది. 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 111/7తో ఆట కొనసాగించిన కర్ణాటక తమ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. వినయ్ కుమార్ (36), అభిమన్యు మిథున్ (33), శ్రేయస్ గోపాల్ (23 నాటౌట్) పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. విదర్భ పేసర్ రజనీశ్ గుర్బాని (7/68) చివరి రోజు కూడా చెలరేగి ఆఖరి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. గురువారం కర్ణాటక ఇన్నింగ్స్ 16.1 ఓవర్లు సాగింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 12 వికెట్లు గుర్బానికే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నెల 29నుంచి ఇండోర్‌లో జరిగే ఫైనల్లో ఢిల్లీతో విదర్భ తలపడుతుంది. మలుపులు, మెరుపులు... రంజీ ట్రోఫీ చరిత్రలో గొప్ప మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయే ఈ సెమీస్‌లో ఆఖరి రోజు 75 నిమిషాల పాటు సాగిన ఆటలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. చక్కటి పోరాటపటిమతో మ్యాచ్‌ను ఇక్కడి దాకా తీసుకొచ్చిన విదర్భ చివర్లో కాస్త తడబాటుకు లోనైంది. ఫలితంగా కర్ణాటక బ్యాట్స్‌మెన్ చకచకా పరుగులు సాధించారు. వరుసగా చెత్త బంతులు వేయడంతో వేగంగా పరుగులు వచ్చాయి. అయితే గుర్బాని ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన వినయ్ కుమార్ అదే ఓవర్ చివరి బంతికి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో విదర్భ జట్టులో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత వచ్చిన మిథున్ బౌండరీలతో ఎదురుదాడి చేశాడు. నిజానికి 1 పరుగు వద్ద సింగిల్ తీసే ప్రయత్నంలో సగం పిచ్ దాటిన మిథున్, గోపాల్ తిరస్కరించడంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే కీపర్ వాడ్కర్ బంతిని సరిగా అందుకోకపోవడంతో మిథున్ బతికిపోయాడు. అతను ఉమేశ్, సర్వతే ఓవర్లలో వరుసగా రెండేసి బౌండరీలు బాదాడు. ఈ జోరులో కర్ణాటక గెలుపు ఖాయంలా అనిపించింది. కానీ అత్యుత్సాహం ప్రదర్శించిన మిథున్...గుర్బానీ బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. గాల్లో లేచిన బంతిని డీప్ పాయింట్లో సర్వతే అందుకోవడంతో కర్ణాటక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో పొరపాటు కర్ణాటక ఆట ముగించింది. అప్పటికే నిలదొక్కుకున్న, కెరీర్లో నాలుగు సెంచరీలు సాధించిన రికార్డు ఉన్న శ్రేయస్ గోపాల్ ఒక ఎండ్‌లో ఉండగా... బలహీన బ్యాట్స్‌మన్ అరవింద్ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడంతో అతనే మళ్లీ స్ట్రైక్‌కు రావాల్సి రావడం ఆ జట్టు రాతను మార్చింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే అరవింద్‌ను అవుట్ చేసిన గుర్బాని ఉద్వేగంగా కంటతడి పెట్టాడు. విదర్భ సంబరాల్లో మునిగిపోగా...కర్ణాటక తమను తాము నిందించుకోవాల్సి వచ్చింది. చివరకు వేదన... రంజీ నాకౌట్లో ఇలాంటి ఫలితాలు గతంలోనూ వచ్చాయి. 1990–91 ఫైనల్లో హర్యానా చేతిలో 2 పరుగులతో ముంబై ఓడగా...1992–93 ప్రిక్వార్టర్ ఫైనల్లో కర్ణాటక 5 పరుగులతో మధ్యప్రదేశ్ చేతిలో పరాజయంపాలైంది. 2009–10 ఫైనల్లో కర్ణాటక 6 పరుగులతో ముంబై చేతిలో ఓడింది. బరోడా, సదరన్ పంజాబ్ మధ్య 1945–46 సెమీస్ ‘టై’గా ము గియగా, టాస్‌తో బరోడాను విజేతగా తేల్చారు. -
ఆంధ్ర దీటైన జవాబు
వడోదర: కెప్టెన్ హనుమ విహారి (118 బంతుల్లో 71 బ్యాటింగ్; 11 ఫోర్లు), రికీ భుయ్ (102 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో బరోడాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర రెండో రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (38 బంతుల్లో 40; 5 ఫోర్లు) ధాటిగా ఆడి వెనుదిరగ్గా, డీబీ ప్రశాంత్ (14) విఫలమయ్యాడు. విహారి, భుయ్ మూడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 128 పరుగులు జత చేశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 247/7 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన బరోడా ఆటను తొందరగా ముగించడంలో ఆంధ్ర బౌలర్లు విఫలమయ్యారు. బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటైంది. స్వప్నిల్ సింగ్, అతీత్ సేఠ్ ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 139 పరుగులు జోడించడం విశేషం. అయ్యప్పకు 4 వికెట్లు దక్కగా... కార్తీక్, భార్గవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఆంధ్ర మరో 183 పరుగులు వెనుకబడి ఉంది. మరోవైపు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగాల్సిన రంజీ మ్యాచ్ వరుసగా రెండో రోజూ రద్దయింది. మైదానం చిత్తడిగా ఉండటంతో ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. -
పట్టు బిగించిన హైదరాబాద్
వల్సాడ్: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్సలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్సలో 163 పరుగుల భారీ ఆధిక్యం దక్కడంతో ప్రస్తుతం ఓవరాల్ ఆధిక్యం 278 పరుగులకు చేరింది. అంతకు ముందు ఛత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్సలో 188 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్రకు స్వల్ప ఆధిక్యం గువహటి: ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ తమ రెండో ఇన్నింగ్సలో 5 వికెట్లకు 229 పరుగులు చేసింది. రోహన్ ప్రేమ్ (89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్సలో ఆంధ్రకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం కోల్పోయిన కేరళ ప్రస్తుతం 222 పరుగులు ముందంజలో ఉంది. ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్సలో 226 పరుగులు చేసింది. -
యువీ భారీ సెంచరీ.. వోహ్రా డబుల్
న్యూఢిల్లీ: ఫామ్‌లోలేని భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అజేయ భారీ సెంచరీతో చెలరేగగా, మనన్ వోహ్రా అజేయ డబుల్ సెంచరీ చేశాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-ఎలో భాగంగా బరోడాతో మ్యాచ్‌లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన యువీ (179), వోహ్రా (201) అద్భుతంగా ఆడారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బరోడా 529 పరుగులు చేసింది. మ్యాచ్ మూడోరోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్ 452/2 స్కోరు చేసి దీటైన సమాధానం ఇచ్చింది. యువీ, వోహ్రా అజేయంగా 314 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 77 పరుగులు వెనుకబడివుంది. -
సౌరాష్ట్రపై ఒడిశా గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఒడిశా బోణీ చేసింది. గ్రూప్-బిలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఒడిశా 32 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒడిశా బౌలర్ సూర్యకాంత్ ప్రధాన్ (3/37, 5/69) 8 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదివారం 96/5 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర 101 ఓవర్లలో 179 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ సాగర్ (68) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, లోయర్ ఆర్డర్లో అర్పిత్ వసావ్డా (45) రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ప్రధాన్ బౌలింగ్ ధాటికి విలవిలలాడారు. అతనితో పాటు కీలక సమయంలో ధీరజ్ సింగ్ 2 పడగొట్టగా... దీపక్, సమంత్రే చెరో వికెట్ పడతీశారు. తొలి ఇన్నింగ్సల్లో ఒడిశా 228, సౌరాష్ట్ర 186 పరుగులు చేశాయి. -
ఆ సంఘటనే వ్యక్తిగా మార్చింది: కోహ్లి
న్యూఢిల్లీ: క్రికెటర్‌గా ఒక వ్యక్తి ఎంతో సంతోషాన్ని అనుభవించి ఉండొచ్చు. కానీ దాని వెనుక అంతులేని విషాదాలు కూడా దాగి ఉంటాయి. ఇలాంటి సంఘటనను స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి 18 ఏళ్ల వయసులోనే అనుభవించాడు. 19 డిసెంబర్ 2006 తెల్లవారుజామున కోహ్లి తండ్రి ప్రేమ్... హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. ఆ సమయంలో విరాట్ ఢిల్లీ తరఫున కర్ణాటకతో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్‌గా 40 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అప్పటికి ఢిల్లీ జట్టుకు ఫాలో ఆన్ ప్రమాదం పొంచి ఉంది. కానీ తండ్రి మరణ వార్తను గుండెల్లోనే అదిమి పెట్టుకుని క్రీజులో అడుగుపెట్టిన కోహ్లి 90 పరుగులు చేసి జట్టును గట్టెక్కించాడు. కష్టకాలంలో కూడా విరాట్ ఎంత బాధ్యతాయుతంగా ఆడతాడో చెప్పడానికి ఈ సంఘటన ఒక్కటి చాలు. తండ్రి చనిపోయిన దశాబ్దం తర్వాత కోహ్లి... తనను వ్యక్తిగా మార్చిన ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ‘మా నాన్న చనిపోయిన ఆ రోజు రాత్రి నాకు ఇంకా గుర్తుంది. నా జీవితంలోనే అదో కఠినమైన సమయం. నా తండ్రి మరణం సహజంగానే వచ్చినా.. ఉదయం మ్యాచ్ ఆడాలన్న బాధ్యత కూడా నాపై ఉంది. ఉదయమే నా కోచ్ పిలిచి అడిగినా ఆడతాననే చె ప్పా. ఎందుకంటే మ్యాచ్‌ను మధ్యలో వదిలేసిపోవడం భావ్యం అని పించలేదు. ఆ క్షణమే నన్ను ఓ వ్యక్తిగా మార్చింది. ఈ బాధ్యతే నన్ను ఆటలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లింది’ అని కోహ్లి వివరించాడు. -
అజహర్‌తో ఎందుకు మాట్లాడారు?
డీడీసీఏకు బీసీసీఐ లేఖ న్యూఢిల్లీ: బీసీసీఐ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌తో విదర్భ రంజీ ఆటగాళ్లు సంభాషించడం వివాదాస్పదమైంది. 2000లో వెలుగు చూసిన మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగా అజ్జూపై బీసీసీఐ వేటు వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఉపాధ్యక్షుడు చేతన్ చౌహాన్ ఆహ్వానం మేరకు అజహర్ మైదానానికి వచ్చారు. అయితే విదర్భకు ఆడుతున్న వెటరన్ క్రికెటర్లు వసీం జాఫర్, ఎస్.బద్రీనాథ్, చీఫ్ కోచ్ పారస్ మాంబ్రే.. అజహర్‌తో మాట్లాడుతూ కనిపించారు. అవినీతి వ్యతిరేక యూనిట్ నిబంధనల ప్రకారం నిషేధిత ఆటగాళ్లతో ప్రస్తుత క్రికెటర్లు ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. ‘బీసీసీఐ నుంచి మాకు లేఖ అందిన విషయం వాస్తవమే. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల అధికారిక స్థలం (పీఎంఓఏ)లో అజహర్‌తో వారు ఎలా మా ట్లాడారని ప్రశ్నించారు. అయితే అజహర్ పీఎంఓఏ దగ్గర లేరు. ఈవిషయంలో కాస్త గందరగోళం నెల కొంది. ఏది ఏమైనా అజ్జూతో ఆటగాళ్లు మాట్లాడకూడదని చెప్పారు కాబట్టి ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాం’ అని చౌహాన్ తెలిపారు. -
ఆంధ్ర ఇన్నింగ్స్ విజయం
గోవాతో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఇక నాకౌట్ అవకాశాలు హైదరాబాద్ చేతిలో సాక్షి, ఒంగోలు: పేస్ బౌలర్ దువ్వారపు శివ కుమార్ (5/38) హడలెత్తించడంతో... గోవాతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఇన్నింగ్స్ 136 పరుగుల ఆధిక్యంతో భారీ విజయాన్ని సాధించింది. ఆంధ్ర బౌలర్ల దూకుడుకు ఈ మ్యాచ్ మూడో రోజుల్లోనే ముగియడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 187/8తో ఆదివారం తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన గోవా మరో 11 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లను కోల్పోయి 198 పరుగులవద్ద ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆంధ్ర బౌలర్ల ధాటికి గోవా బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు క్రీజ్‌లో నిలువలేకపోయారు. తుదకు 81.4 ఓవర్లలో 214 పరుగులవద్ద ఆలౌటై ఇన్నింగ్స్ ఓటమిని చవిచూశారు. గోవా జట్టులో ఓపెనర్ అమోగ్ దేశాయ్ (112 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 57), వేదాంత్ నాయక్ (82 బంతుల్లో 8 ఫోర్లతో 37) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో శివ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా... స్టీఫెన్ మూడు, హరీష్, విజయ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ను 548/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్‌తో రంజీ: హైదరాబాద్ 297/1 సాక్షి, హైదరాబాద్: తన్మయ్ అగర్వాల్ (303 బంతుల్లో 14 ఫోర్లతో 105 బ్యాటింగ్), విహారి (229 బంతుల్లో 19 ఫోర్లు, సిక్సర్‌తో 138 బ్యాటింగ్) సెంచరీలు చేయడంతో... హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ దీటైన జవాబు ఇచ్చింది. మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో వికెట్ నష్టానికి 297 పరుగులు చేసింది. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (9 ఫోర్లతో 48) త్రుటిలో అర్ధ సెంచరీని కోల్పోయాడు. హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కాలంటే చివరిరోజు ఆ జట్టు మరో 215 పరుగులు చేయాలి. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. ఈ గెలుపుతో ఆంధ్ర ఖాతాలో ఏడు పాయింట్లు చేరాయి. ప్రస్తుతం ఆంధ్ర మొత్తం 29 పాయింట్లతో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో ఉండగా... హిమాచల్‌ప్రదేశ్ 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక ఆంధ్ర నాకౌట్ ఆశలన్నీ హైదరాబాద్, హిమాచల్‌ప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసి హిమాచల్‌ప్రదేశ్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తే మాత్రం ఆ జట్టు 30 పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తే మాత్రం ఆంధ్ర జట్టు 29 పాయింట్లతో నాకౌట్ దశకు చేరుకుంటుంది. హిమాచల్‌ప్రదేశ్ 28 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా అస్సాం జట్టు ఇప్పటికే 35 పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత పొందింది. -
అస్సాం 248/4
హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్ సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ మ్యాచ్ మొదటి రోజు అస్సాంను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మంగళవారం ఆట ముగిసే సమయానికి అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. శివ్‌శంకర్ రాయ్ (183 బంతుల్లో 72; 7 ఫోర్లు), గోకుల్ శర్మ (121 బంతుల్లో 54; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించి అస్సాం ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రస్తుతం తర్జీందర్ సింగ్ (25 బ్యాటింగ్), ధీరజ్ జాదవ్ (21 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ బౌలర్ అశోక్ అయ్యంగార్ హర్ష 2 వికెట్లు పడగొట్టగా, ఆశిష్ రెడ్డి, మెహదీ హసన్ ఒక్కో వికెట్ తీశారు. -
హైదరాబాద్ 568/7
గోవాతో రంజీ మ్యాచ్ సాక్షి, హైదరాబాద్: గోవాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ రెండో రోజు కూడా హైదరాబాద్ జోరు కొనసాగింది. అహ్మద్ ఖాద్రీ (255 బంతుల్లో 115 బ్యాటింగ్; 8 ఫోర్లు) సెంచరీతో చెల రేగడంతో మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 180 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 568 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆశిష్ రెడ్డి (119 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణిం చాడు. 290/1 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన హైదరాబాద్ కొద్ది సేపటికే విహారి (179), తన్మయ్ అగర్వాల్ (135) వికెట్లను కోల్పోయింది. ఆ వెంటనే కెప్టెన్ రవితేజ (10), అనిరుధ్ (7) కూడా అవుటయ్యారు. అయితే ఖాద్రీ, ఆశిష్ ఆరో వికెట్‌కు 138 పరుగులు జోడించి జట్టు భారీ స్కోరు లో కీలక పాత్ర పోషించారు. గోవా బౌలర్లలో బందేకర్ 3 వికెట్లు పడగొట్టగా, జకాతికి 2 వికెట్లు దక్కాయి. -
మనోళ్లూ నిలబడ్డారు...
సాక్షి, హైదరాబాద్: త్రిపురతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ దీటైన జవాబు ఇచ్చింది. బౌలర్లకు ఏ మాత్రం సహకరించని ఉప్పల్ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ఫలి తంగా ఆదివారం మూడో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో వికెట్ నష్టానికి 258 పరుగులు చేసింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి (235 బంతుల్లో 138 బ్యాటింగ్; 20 ఫోర్లు) సీజన్లో తొలి సెంచరీ సాధించగా... డీబీ రవితేజ (196 బంతుల్లో 90 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకానికి చేరువలో నిలిచాడు. వీరిద్దరు ఇప్పటికే రెండో వికెట్‌కు అభేద్యంగా 228 పరుగులు జోడించారు. అంతకు ముందు త్రిపుర తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 650 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో మరో 392 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. సోమవారం మ్యాచ్‌కు ఆఖరి రోజు. అందుబాటులో ఉండే కనీసం 90 ఓవర్లలో హైదరాబాద్ ఈ స్కోరు చేసి ఆధిక్యం దక్కించుకోవాలంటే ప్రతీ బ్యాట్స్‌మన్ చెలరేగాల్సి ఉంటుంది. త్రిపుర స్కోరును అందుకోలేకపోయినా హైదరాబాద్ ఆలౌట్ కాకుండా ఉంటే ఇరు జట్ల ఖాతాలో ఒక్కో పాయింట్ చేరుతుంది. రాణించిన బ్యాట్స్‌మెన్... 588/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన త్రిపురను ఆలౌట్ చేయడంలో మాత్రం హైదరాబాద్ విఫలమైంది. మరో 10.3 ఓవర్లు ఆడిన త్రిపుర ఓవర్‌నైట్ స్కోరుకు మరో 62 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అబ్బాస్ అలీ (132 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు. అనంతరం సుమన్ (21), అక్షత్ రెడ్డి హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కొద్దిసేపటికే సుమన్‌ను మజుందార్ అవుట్ చేసి త్రిపురకు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత అక్షత్, రవితేజ చక్కటి ఇన్నింగ్స్‌లతో జట్టును నిలబెట్టారు. గత ఆరు ఇన్నింగ్స్‌లలో ఒకటే అర్ధ సెంచరీ సాధించిన అక్షత్ ఈసారి ఆత్మవిశ్వాసంతో చక్కటి షాట్లు ఆడాడు. 44 పరుగుల వద్ద అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. మజుం దార్ బౌలింగ్‌లో అక్షత్ ఇచ్చిన క్యాచ్‌ను రాణా దత్తా వదిలేశాడు. టీ విరామం తర్వాత ఈ ఇద్దరూ దూకుడు పెంచారు. ఇదే జోరును కొనసాగిస్తూ అక్షత్ 191 బంతుల్లో ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. -
రాణించిన రవితేజ, అక్షత్
జింఖానా, న్యూస్‌లైన్: మహారాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతోంది. బ్యాట్స్‌మెన్ వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో స్కోరు వేగం మందగించింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 98 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. రవితేజ (204 బంతుల్లో 98; 13 ఫోర్లు) సెంచరీ అవకాశం చేజార్చుకోగా, కెప్టెన్ అక్షత్ రెడ్డి (204 బంతుల్లో 86; 13 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. మహారాష్ట్ర బౌలర్లలో అక్షయ్ దరేకర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆట ముగిసే సమయానికి విహారి (98 బంతుల్లో 39 బ్యాటింగ్; 6 ఫోర్లు)తో పాటు ఖాద్రీ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఆదివారం ఆటకు ఆఖరి రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోకుండా చివరి రోజు హైదరాబాద్ ఏ మాత్రం పోరాడుతుందో చూడాలి. రవితేజ రనౌట్... 53/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ కొద్ది సేపటికే సుమన్ (73 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. అయితే అక్షత్ రెడ్డి, రవితేజ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించారు. అక్షత్‌ను అవుట్ చేసి ఖురానా ఈ జోడిని విడదీశాడు. అనంతరం విహారితో కలిసి రవితేజ మరో కీలక ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఈ దశలో అనవసరంగా రవితేజ రనౌటయ్యాడు. లేని పరుగు కోసం రవితేజ ప్రయత్నించగా విహారి స్పందించకపోవడంతో ఇద్దరూ ఒకే ఎండ్‌కు చేరుకున్నారు. దాంతో రవితేజ సెంచరీ మిస్సయ్యింది. ఆ వెంటనే సందీప్ (1) కూడా వెనుదిరిగాడు. అయితే విహారి, ఖాద్రీ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. -
లాహ్లీకి లక్కీ చాన్స్
చండీగఢ్: సచిన్ టెండూల్కర్ చివరి రెండు టెస్టులకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్‌కతా, ముంబై సొంతం చేసుకున్నాయి. ఇక మాస్టర్ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం మిగిలిన నగరాలకు లేదు. కానీ హర్యానాలోని లాహ్లీ అనే చిన్న పట్టణానికి మాత్రం ఈ లక్కీ చాన్స్ దొరికింది. మాస్టర్ బ్లాస్టర్ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈ పట్టణ వాసులకు దక్కనుంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహకంగా ఈ నెల 27 నుంచి 30 వరకు హర్యానాతో జరిగే రంజీ మ్యాచ్‌లో ముంబై తరఫున సచిన్ ఆడుతున్నాడు. హర్యానాలోని రోహ్తక్ జిల్లా పరిధిలో ఉన్న లాహ్లీ అనే చిన్న పట్ణణం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక్కడి బన్సీలాల్ స్టేడియం సామర్థ్యం కేవలం 8 వేలే కావడం గమనార్హం. దిగ్గజ ఆటగాడైన సచిన్ తమ రాష్ట్రంలో ఆడనుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రణ్‌బీర్ మహేంద్ర అన్నారు. ‘మరో కొద్ది రోజుల్లో కెరీర్‌కు ముగింపు పలకబోతున్న సచిన్ ఇక్కడ ఆడనుండడం హర్యానాకు, హర్యానా క్రికెట్ సంఘానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. అతడు కెరీర్ ఆరంభించినప్పుడు నేను బోర్డు కార్యదర్శిగా ఉన్నాను. 1991-92లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు మేనేజర్‌గా పనిచేశాను. అలాగే 20 ఏళ్ల అనంతరం 2011లో జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లినప్పుడు నా కుమారుడు అనిరుధ్ చౌధురి మేనేజర్‌గా వ్యవహరించాడు. దీనికి మేం అదష్టవంతులం అనుకోవాలి’ అని రణ్‌బీర్ తెలిపారు.