
హైదరాబాద్ 568/7
గోవాతో రంజీ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: గోవాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ రెండో రోజు కూడా హైదరాబాద్ జోరు కొనసాగింది. అహ్మద్ ఖాద్రీ (255 బంతుల్లో 115 బ్యాటింగ్; 8 ఫోర్లు) సెంచరీతో చెల రేగడంతో మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 180 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 568 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆశిష్ రెడ్డి (119 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణిం చాడు.
290/1 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన హైదరాబాద్ కొద్ది సేపటికే విహారి (179), తన్మయ్ అగర్వాల్ (135) వికెట్లను కోల్పోయింది. ఆ వెంటనే కెప్టెన్ రవితేజ (10), అనిరుధ్ (7) కూడా అవుటయ్యారు. అయితే ఖాద్రీ, ఆశిష్ ఆరో వికెట్‌కు 138 పరుగులు జోడించి జట్టు భారీ స్కోరు లో కీలక పాత్ర పోషించారు. గోవా బౌలర్లలో బందేకర్ 3 వికెట్లు పడగొట్టగా, జకాతికి 2 వికెట్లు దక్కాయి.