సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ అండర్–16 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు విజయాల బోణీ చేసింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు సమష్టిగా రాణించడంతో జింఖానా మైదానంలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 57 పరుగులతో ఘనవిజయాన్ని సాధించింది. ఓవర్‌నైట్‌స్కోరు 341/3తో గురువారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 95.3 ఓవర్లలో 9 వికెట్లకు 419 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో గోవా జట్టుకు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పి. శివ (133) ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం ఒక పరుగు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. ఇల్యాన్ సథాని (56; 5 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.
కెప్టెన్ కె. సాయి పూర్ణానంద రావు (14), టి. రోహన్ (4), వికెట్ కీపర్ వి. సహస్ర (15), షణ్ముఖ (1), త్రిశాంక్ గుప్తా (1) వెంటవెంటనే వెనుదిరిగారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన గోవా జట్టును హైదరాబాద్ బౌలర్లు టి. రోహన్ (5/22), త్రిశాంక్ గుప్తా (5/33) వణికించారు. వీరిద్దరి ధాటికి గోవా జట్టు 55.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ సాగర్ (26), ఓపెనర్ ఓం రాందాస్ (20) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో గోవా జట్టు 242 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్ విజయం సాధించిన హైదరాబాద్ జట్టుకు 7 పాయింట్లు లభించాయి. ఆదివారం నుంచి జరిగే తర్వాతి మ్యాచ్‌లో కర్ణాటకతో హైదరాబాద్ తలపడుతుంది.
ఆంధ్ర మ్యాచ్ డ్రా
ఈసీఐఎల్ గ్రౌండ్‌లో కర్ణాటక జట్టుతో జరిగిన మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు విజయానికి 2 వికెట్ల దూరంలో ఆగిపోయింది. చివర్లో కర్ణాటక బ్యాట్స్‌మెన్ పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించగలిగారు. 101/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కర్ణాటక జట్టు 65.1 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్ర బౌలర్లలో వాసు 5 వికెట్లతో చెలరేగాడు.
దీంతో ఆంధ్ర జట్టుకు 305 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన కర్ణాటక జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 74.5 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులతో నిలిచింది. హైదరాబాద్ బౌలర్లలో కె. నితీశ్, అక్షయ్, వాసు తలా 2 వికెట్లు తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు 444 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఆంధ్ర జట్టుకు 3 పాయింట్లు, గోవాకు ఒక పాయింట్ లభించాయి. తర్వాతి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కేరళతో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment