ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ట్రిపుల్‌ సెంచరీలు.. రికార్డులు బద్దలు | Ranji Trophy: Goa Batters Kauthankar, Bakle Score Triple Hundreds Against Arunachal Pradesh, Equal 35 Year Old Tournament Record | Sakshi
Sakshi News home page

ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ట్రిపుల్‌ సెంచరీలు.. రికార్డులు బద్దలు

Published Thu, Nov 14 2024 4:21 PM | Last Updated on Thu, Nov 14 2024 4:37 PM

Ranji Trophy: Goa Batters Kauthankar, Bakle Score Triple Hundreds Against Arunachal Pradesh, Equal 35 Year Old Tournament Record

రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు గోవా బ్యాటర్లు అజేయ ట్రిపుల్‌ సెంచరీలతో చెలరేగారు. స్నేహల్‌ కౌతంకర్‌ 215 బంతుల్లో  45 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 314 పరుగులు చేయగా.. కశ్యప్‌ బాక్లే 269 బంతుల్లో 39 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 300 పరుగులు చేశారు. స్నేహల్‌, కశ్యప్‌ మూడో వికెట్‌కు అజేయమైన 606 పరుగులు జోడించి రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 

స్నేహల్‌, కశ్యప్‌ ట్రిపుల్‌ సెంచరీలతో విరుచుకుపడటంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో (93 ఓవర్లలోనే) రెండు వికెట్ల నష్టానికి 727 పరుగులు చేసింది. అంతకుముందు అరుణాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకు ఆలౌటైంది. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. 643 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అరుణాచల్‌ ప్రదేశ్‌ ఈ ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగించి 92 పరుగులకు చాపచుట్టేసింది. ఫలితంగా గోవా ఇన్నింగ్స్‌ 551 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  

ఈ మ్యాచ్‌లో విశేషాలు.. నమోదైన రికార్డులు..

రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ట్రిపుల్‌ సెంచరీలు చేయడం ఇది రెండో సారి మాత్రమే.

1989లో గోవాతో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన డబ్ల్యూవీ రామన్‌, అర్జున్‌ క్రిపాల్‌ సింగ్‌ ఒకే ఇన్నింగ్స్‌లో ట్రిపుల్‌ సెంచరీలు చేశారు.

స్నేహల్‌, కశ్యప్‌ మూడో వికెట్‌కు అజేయమైన 606 పరుగులు జోడించి రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

ఈ మ్యాచ్‌లో గోవా చేసిన స్కోర్‌ (727/2) రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌గా నమోదైంది.

రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ మేఘాలయ చేసింది. 2018 సీజన్‌లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో మేఘాలయ 826 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో గోవా చేసిన స్కోర్‌ (727/2) యావత్‌ రంజీ ట్రోఫీ చరిత్రలోనే తొమ్మిదో అత్యధిక స్కోర్‌గా రికార్డైంది.

ఈ మ్యాచ్‌లో స్నేహల్‌ చేసిన ట్రిపుల్‌ సెంచరీ మూడో వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీగా (205 బంతుల్లో) రికార్డైంది.

రంజీల్లో ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ రికార్డు తన్మయ్‌ అగర్వాల్‌ పేరిట ఉంది. తన్మయ్‌ గత రంజీ సీజన్‌లో 147 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement