మనోళ్లూ నిలబడ్డారు... | Tripura score 650/8 decl; Hyd reach 258 for one on day three | Sakshi
Sakshi News home page

మనోళ్లూ నిలబడ్డారు...

Published Mon, Dec 9 2013 1:54 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మనోళ్లూ నిలబడ్డారు... - Sakshi

మనోళ్లూ నిలబడ్డారు...

సాక్షి, హైదరాబాద్:  త్రిపురతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ దీటైన జవాబు ఇచ్చింది. బౌలర్లకు ఏ మాత్రం సహకరించని ఉప్పల్ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ఫలి తంగా ఆదివారం మూడో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో వికెట్ నష్టానికి 258 పరుగులు చేసింది.  కెప్టెన్ అక్షత్ రెడ్డి (235 బంతుల్లో 138 బ్యాటింగ్; 20 ఫోర్లు) సీజన్‌లో తొలి సెంచరీ సాధించగా... డీబీ రవితేజ (196 బంతుల్లో 90 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకానికి చేరువలో నిలిచాడు. వీరిద్దరు ఇప్పటికే రెండో వికెట్‌కు అభేద్యంగా 228 పరుగులు జోడించారు.

అంతకు ముందు త్రిపుర తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 650 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో మరో 392 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. సోమవారం మ్యాచ్‌కు ఆఖరి రోజు. అందుబాటులో ఉండే కనీసం 90 ఓవర్లలో హైదరాబాద్ ఈ స్కోరు చేసి ఆధిక్యం దక్కించుకోవాలంటే ప్రతీ బ్యాట్స్‌మన్ చెలరేగాల్సి ఉంటుంది. త్రిపుర స్కోరును అందుకోలేకపోయినా హైదరాబాద్ ఆలౌట్ కాకుండా ఉంటే ఇరు జట్ల ఖాతాలో ఒక్కో పాయింట్ చేరుతుంది.
 రాణించిన బ్యాట్స్‌మెన్...
 588/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన త్రిపురను ఆలౌట్ చేయడంలో మాత్రం హైదరాబాద్ విఫలమైంది. మరో 10.3 ఓవర్లు ఆడిన త్రిపుర ఓవర్‌నైట్ స్కోరుకు మరో 62 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అబ్బాస్ అలీ (132 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు.
  అనంతరం సుమన్ (21), అక్షత్ రెడ్డి హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కొద్దిసేపటికే సుమన్‌ను మజుందార్ అవుట్ చేసి త్రిపురకు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత అక్షత్, రవితేజ చక్కటి ఇన్నింగ్స్‌లతో జట్టును నిలబెట్టారు. గత ఆరు ఇన్నింగ్స్‌లలో ఒకటే అర్ధ సెంచరీ సాధించిన అక్షత్ ఈసారి ఆత్మవిశ్వాసంతో చక్కటి షాట్లు ఆడాడు. 44 పరుగుల వద్ద అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. మజుం దార్ బౌలింగ్‌లో అక్షత్ ఇచ్చిన క్యాచ్‌ను రాణా దత్తా వదిలేశాడు.  టీ విరామం తర్వాత ఈ ఇద్దరూ దూకుడు పెంచారు. ఇదే జోరును కొనసాగిస్తూ అక్షత్ 191 బంతుల్లో ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement