బోణీ ఇంకెంత దూరం!
అగర్తలా: రంజీ ట్రోఫీలో ‘డ్రా’లతో నెట్టుకొస్తున్న హైదరాబాద్ ఎలాగైనా గెలుపుబాట పట్టాలని చూస్తోంది. గ్రూప్ ‘సి’లో సోమవారం నుంచి జరిగే లీగ్ మ్యాచ్‌లో రవితేజసేన త్రిపురతో తలపడనుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఈ గ్రూప్‌లో హిమాచల్ ప్రదేశ్ తర్వాత రెండో స్థానంలో ఉన్నప్పటికీ హైదరాబాద్ జట్టుకు విజయం మాత్రం వెలతిగా ఉంది.
ఆడిన నాలుగు మ్యాచ్‌ల్ని డ్రా చేసుకున్న ఈ జట్టు కనీసం త్రిపురనైనా ఓడించాలనే నిశ్చయంతో బరిలోకి దిగుతోంది. బ్యాట్స్‌మెన్ జోరు మీదున్నా... బౌలర్ల వైఫల్యం జట్టును వేధిస్తోంది. ఇంతవరకు వ్యక్తిగతంగా ఏ ఒక్క బౌలర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను శాసించలేకపోయాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఆరంభంలో పట్టుబిగించినా... అంతలోనే ఆదమరుస్తుండటంతో కేవలం ఆధిక్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బౌలర్లు రాణిస్తేనే...
సర్వీసెస్‌తో జరిగిన గత మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన ఆకాశ్ భండారీ బౌలింగ్‌లో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 9 వికెట్లు తీసినప్పటికీ విరివిగా పరుగులిచ్చాడు. ఈ వికెట్లు వరుస విరామాల్లో పడగొట్టి ఉంటే జట్టుకు ఉపయోగపడేది. కానీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ‘డ్రా’ లక్ష్యంగా ఆడటంతో చేసేదేమీ లేకపోయింది.
దీంతో పాటు మిగతా బౌలర్లు తమ వంతుగా రాణించి వుంటే ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ పట్టుబిగించేదేమో. బ్యాటింగ్‌లో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి జోరు మీదున్నారు. ఇద్దరూ చెరో రెండు సెంచరీలు సాధించారు. అక్షత్ రెడ్డి, రవితేజ, ఆశిష్ రెడ్డిలు కూడా అడపాదడపా రాణిస్తుండటంతో బ్యాటింగ్‌లో ఢోకా లేదు. ఎటొచ్చి అందివచ్చిన అవకాశాల్ని చేజారుస్తున్న బౌలింగ్ విభాగమే జట్టును ఆందోళనపరుస్తోంది.
తడబడుతున్న త్రిపుర
మరోవైపు త్రిపుర ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ‘డ్రా’ చేసుకోగా, ఒక మ్యాచ్‌లో ఓడింది. జట్టు బ్యాటింగ్ భారాన్ని ఓపెనర్ బిశాల్ ఘోష్, కెప్టెన్ అభిజిత్ దే మోస్తున్నారు. మిగతావారు వరుసగా విఫలమవడంతో కనీసం ఈ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్నైనా సంపాదించలేకపోతోంది. బౌలర్ల వైఫల్యం కూడా జట్టును కలవరపెడుతోంది. అయితే సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను కట్టడి చేయాలనే ఉత్సాహంతో ఉంది.
జట్లు
హైదరాబాద్: డి.బి. రవితేజ (కెప్టెన్), అహ్మద్ ఖాద్రీ (వైస్ కెప్టెన్), అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, విహారి, అనిరుధ్, ఇబ్రహీం ఖలీల్, ఆశిష్ రెడ్డి, రవికిరణ్, సి.వి.మిలింద్, అన్వర్ అహ్మద్‌ఖాన్, మెహదీ హసన్, ఆకాశ్ భండారి, డానీ డెరిక్ ప్రిన్స్, హబీబ్ అహ్మద్.
త్రిపుర: అభిజిత్ దే (కెప్టెన్), బిశాల్ ఘోష్, ఉదియన్ బోస్, సుభ్రజిత్ రాయ్, రాకేశ్ సోలంకి, యోగేశ్ తకవాలే, కౌషల్ అచర్జీ, మణిశంకర్ మురసింగ్, రాణా దత్త, అభిజిత్ సర్కార్, విక్కీ సాహా.