త్రిపుర కూడా ‘ఆడుకుంది’
సాక్షి, హైదరాబాద్: లోయర్ ఆర్డర్‌లో ఆడే ఒక బౌలింగ్ ఆల్‌రౌండర్... ఈ సీజన్‌లో పది ఇన్నింగ్స్‌లో 24 పరుగుల అత్యధిక స్కోరుతో అతను చేసిన మొత్తం పరుగులు 115 మాత్రమే! అలాంటి ఆటగాడు కూడా హైదరాబాద్ బౌలింగ్‌ను లెక్క చేయకుండా చితక్కొట్టేశాడు. తొమ్మిది మంది బౌలర్లు శ్రమించినా అతడిని అవుట్ చేయలేక చేతులెత్తేశారు.
బలహీన ప్రత్యర్థి అనే అలసత్వమో... ఇక అంతే అనే నైరాశ్యమో గానీ హైదరాబాద్ జట్టు త్రిపుర ముందు కూడా తలవంచింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మణిశంకర్ మురాసింగ్ (207 బంతుల్లో 140 బ్యాటింగ్; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ యోగేశ్ టకవాలే (153 బంతుల్లో 65 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఇప్పటికే మూడో వికెట్‌కు అభేద్యంగా 188 పరుగులు జోడించారు. రవికిరణ్, షిండే చెరో వికెట్ పడగొట్టారు.