akshith reddy
-
భారీ ఆధిక్యం దిశగా...
జమ్మూ: హైదరాబాద్ ఆటగాళ్లు జమ్మూకాశ్మీర్‌పై అదరగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అక్షత్ సేన భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. అమోల్ షిండే మూడు పరుగుల దూరంలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ 118 ఓవర్లలో 514/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం జమ్మూకాశ్మీర్ 198 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాణించిన షిండే మంగళవారం 341/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్, సెంచరీ హీరో రవితేజ (258 బంతుల్లో 179, 20 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రితం రోజు స్కోరుకు 26 పరుగులు జోడించి నిష్ర్కమించాడు. అమోల్ షిండే (104 బంతుల్లో 97, 13 ఫోర్లు) వన్డే తరహా ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఐదో వికెట్‌కు రవితేజ, షిండే 71 పరుగులు జత చేశారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో హబీబ్ అహ్మద్ 21 పరుగులు చేయగా, అబ్సొలెం (12), మెహదీ హసన్ (9) నాటౌట్‌గా నిలిచారు. జమ్మూ బౌలర్లలో రసూల్ 4 వికెట్లు పడగొట్టగా, సమీవుల్లా, రామ్‌దయాళ్, బందీప్ సింగ్ తలా ఓ వికెట్ తీశారు. బందీప్ అర్ధసెంచరీ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కాశ్మీర్‌ను హైదరాబాద్ బౌలర్లు మెహదీ హసన్ (3/55), రవి కిరణ్ (2/32) దెబ్బ తీశారు. జమ్మూ బ్యాటింగ్‌లో బందీప్ సింగ్ (58) అర్ధసెంచరీతో రాణించగా, కెప్టెన్ పర్వేజ్ రసూల్ 24 పరుగులు చేశాడు. ఆట ముగిసే సమయానికి హర్దీప్ సింగ్ 32 పరుగులతో, సమీవుల్లా 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు ఆటలో హైదరాబాద్ బౌలర్లు విజృంభించి తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీయగలిగితే జట్టు విజయం సాధించవచ్చు. లేదంటే 3 పాయింట్లు దక్కే అవకాశముంది. సంక్షిప్త స్కోర్లు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 514/8 డిక్లేర్డ్ (రవితేజ 179, విహారి 109, షిండే 97; రసూల్ 4/99) జమ్మూకాశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 198/6 (బందీప్ సింగ్ 58; మెహదీ హసన్ 3/55, రవికిరణ్ 2/32). -
మనోళ్లూ నిలబడ్డారు...
సాక్షి, హైదరాబాద్: త్రిపురతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ దీటైన జవాబు ఇచ్చింది. బౌలర్లకు ఏ మాత్రం సహకరించని ఉప్పల్ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ఫలి తంగా ఆదివారం మూడో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో వికెట్ నష్టానికి 258 పరుగులు చేసింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి (235 బంతుల్లో 138 బ్యాటింగ్; 20 ఫోర్లు) సీజన్లో తొలి సెంచరీ సాధించగా... డీబీ రవితేజ (196 బంతుల్లో 90 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకానికి చేరువలో నిలిచాడు. వీరిద్దరు ఇప్పటికే రెండో వికెట్‌కు అభేద్యంగా 228 పరుగులు జోడించారు. అంతకు ముందు త్రిపుర తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 650 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో మరో 392 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. సోమవారం మ్యాచ్‌కు ఆఖరి రోజు. అందుబాటులో ఉండే కనీసం 90 ఓవర్లలో హైదరాబాద్ ఈ స్కోరు చేసి ఆధిక్యం దక్కించుకోవాలంటే ప్రతీ బ్యాట్స్‌మన్ చెలరేగాల్సి ఉంటుంది. త్రిపుర స్కోరును అందుకోలేకపోయినా హైదరాబాద్ ఆలౌట్ కాకుండా ఉంటే ఇరు జట్ల ఖాతాలో ఒక్కో పాయింట్ చేరుతుంది. రాణించిన బ్యాట్స్‌మెన్... 588/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన త్రిపురను ఆలౌట్ చేయడంలో మాత్రం హైదరాబాద్ విఫలమైంది. మరో 10.3 ఓవర్లు ఆడిన త్రిపుర ఓవర్‌నైట్ స్కోరుకు మరో 62 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అబ్బాస్ అలీ (132 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు. అనంతరం సుమన్ (21), అక్షత్ రెడ్డి హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కొద్దిసేపటికే సుమన్‌ను మజుందార్ అవుట్ చేసి త్రిపురకు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత అక్షత్, రవితేజ చక్కటి ఇన్నింగ్స్‌లతో జట్టును నిలబెట్టారు. గత ఆరు ఇన్నింగ్స్‌లలో ఒకటే అర్ధ సెంచరీ సాధించిన అక్షత్ ఈసారి ఆత్మవిశ్వాసంతో చక్కటి షాట్లు ఆడాడు. 44 పరుగుల వద్ద అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. మజుం దార్ బౌలింగ్‌లో అక్షత్ ఇచ్చిన క్యాచ్‌ను రాణా దత్తా వదిలేశాడు. టీ విరామం తర్వాత ఈ ఇద్దరూ దూకుడు పెంచారు. ఇదే జోరును కొనసాగిస్తూ అక్షత్ 191 బంతుల్లో ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.